‘మిస్ తెలంగాణ అంబాసిడర్’గా మిసెస్ మంచు లక్ష్మి ! - MicTv.in - Telugu News
mictv telugu

‘మిస్ తెలంగాణ అంబాసిడర్’గా మిసెస్ మంచు లక్ష్మి !

February 2, 2018

ఊరోన్కిఊరాపతి, ఊసుకండ్లోనికి దోమలాపతి అన్నట్టుంది కొంతమంది ఆంధ్రోళ్ల యవ్వారం. కాకతీయ కళా వైభవం పేరుతో మొన్ననే ఓ పెద్దమనిషి ఆంధ్ర నటులకు శాలువలు కప్పి సన్మానం చేసిండు. కాకతీయులను తెలంగాణ రాజులుగనే ఇక్కడి జనం భావించుకుంటరు. సేమ్ సీమాంధ్రులు కూడా కాకతీయులను తెలంగాణ వాళ్ల లెక్కనే చూస్తరు.

ఇట్లా తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అయిన కాకతీయుల పేరును, ఇక్కడి మట్టితో ఏమాత్రం సంబంధం లేని ఓ పెద్ద మనిషి తన పరపతి పెంచుకోవడానికి వాడుకున్నడు. ప్రత్యేక రాష్ట్రం అయినంక కూడా తెలంగాణల తమ మాటే చెల్లుబాటు అవుతోందని చూపిచ్చుకున్నడు. ఆ పెద్దమనిషి చేసిన తమాషా మీద కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ నారాజ్ అయితే ఉల్టా వాళ్ల మీదకే సినిమా వాళ్లు గయ్యిమని లేచిన్రు. ఆ సక్కదనం మర్వకముందే మళ్లో తమాషా షుర్వయింది. సీమాంధ్రుల సమర్పణలో ఆంధ్ర హీరోయిన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఇవాల్టి సంది మిస్ తెలంగాణ పోటీలు మొదలవుతున్నయి.

అవును మీరు చదివింది కరెక్టే. మన తెలంగాణ అమ్మాయిల్లో అందంగా ఉన్న ఒక్కరిని మిస్ తెలంగాణ గా ఆంధ్రవాళ్లు సెలక్ట్ చేస్తరట. ఈ ప్రోగ్రామ్ కే మంచు లక్ష్మీ బ్రాండ్ అంబాసిడర్. ఈ ముచ్చట బయటకు రాంగనే సోషల్ మీడియాల తెలంగాణ నెటిజన్లు సీరియస్ అవుతున్నరు. తెలంగాణల పోటీ పెట్టడానికి ఆంధ్రోళ్లకు ఏం అవసరం అని ఒకరంటే, మిస్ తెలంగాణ పోటీలకు మిసెస్ మంచు లక్ష్మీ బ్రాండ్ అంబాసిడరా? అని ఇంకొకరు సెటైర్ వేసిన్రు. కనీసం తెలంగాణతో సంబంధం ఉన్న ఎవరినైనా అంబాసిడర్ గా పెట్టొచ్చు కదా అని అడుగుతున్నరు. తెలంగాణ వచ్చినా ఇంకా సీమాంధ్రుల థాట్ పోలీసింగ్ ఆగదా? అని  అంటున్నరు.

ఎందుకాగుతది మన పెద్దసారే ఆంధ్రోళ్ల కాలికి ముల్లు కూడా గుచ్చుకోకముందే పంటితో తీయడానికి రెడీ అవుతున్నన్ని రోజులు ఇట్లాంటి ఇచ్చంత్రాలు రోజుకొకటి కనిపిస్తయి.