Thackeray resigns from the post of CM.. Who will be the next CM?
mictv telugu

సీఎం పదవికి ఠాక్రే రాజీనామా..నెక్స్ట్ సీఎం ఎవరు?

June 30, 2022

మహారాష్ట్రలో గతకొన్ని రోజులుగా ఉత్కంఠ రేపిన రాజకీయం బుధవారంతో తుది దశకు చేరుకుంది. ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే తన పదవికి రాజీనామా చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీలో గురువారం బలపరీక్ష జరగాల్సిందేనని సుప్రీం కోర్టు తీర్పును వెలువరించిన మరుక్షణమే ఆయన సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఫేస్‌బుక్ లైవ్‌ ద్వారా ప్రకటించారు.

ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ..”సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తాను. ప్రజాస్వామ్యాన్ని తప్పనిసరిగా పాటిస్తాను. మా ప్రభుత్వం పతనం వెనుక కేంద్రం కుట్ర ఉంది. మా వాళ్లే పరాయి వాళ్లయ్యారు. మహావికాస్ అఘాడీకి ప్రత్యర్థుల దిష్టి తగిలింది. మా ప్రభుత్వానికి అదృష్టం కలిసి రాలేదు” అని ఆయన అన్నారు.

ఈ క్రమంలో మహారాష్ట్ర సీఎంగా నెక్స్ట్ ఎవరు అనే అంశంపై బుధవారం అర్థరాత్రి నుంచి తెగ చర్చలు జరుగుతున్నాయి. తిరుగుబాటు ఎమ్మెల్యేల నాయకుడు షిండే, బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఏం చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. తాజా సమాచారం ప్రకారం.. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు, స్వతంత్ర అభ్యర్థులతో కలిసి బీజేపీ మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని, మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఆయన జూలై 1, శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని సమాచారం. ఉద్ధవ్ రాజీనామా చేసిన వెంటనే ముంబైలోని తాజ్ ప్రెసిడెంట్ హోటల్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆధ్వర్యంలో పార్టీ సమావేశం జరిగింది. తదుపరి అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో చర్చించారు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేలు అందరినీ అందుబాటులో ఉండాలని ఆదేశించారు.