Thackeray's government to be tested tomorrow .. orders issued
mictv telugu

థాక్రే సర్కార్‌కు రేపే బలపరీక్ష..ఆదేశాలు జారీ

June 29, 2022

మహారాష్ట్రలో రాజకీయం రోజు రోజుకు కీలక మలుపులు తిరుగుతోంది. ఉద్దవ్ ఠాక్రే సర్కార్‌కు మహా వికాస అఘాడీ కూటమి షాకుల మీద షాకులు ఇస్తూనే ఉంది. ఈ క్రమంలో బుధవారం ఠాక్రే సర్కార్‌కు మరో షాక్ తగిలింది. రేపు అసెంబ్లీలో ఠాక్రే సర్కారు తమ మెజార్టీని నిరూపించుకోవాలని రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యార్ ఆదేశించారు. ఇందుకోసం రేపు (జూన్ 30) ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయాలని బుధవారం శాసనసభ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు.

గవర్నర్ ఆదేశాల ప్రకారం.. గురువారం ఉదయం 11 గంటలకు ఈ విశ్వాస పరీక్ష జరగనుంది. సాయంత్రం 5 గంటల్లోపు గవర్నర్ ఈ పరీక్షను పూర్తి చేయనున్నారు. బలపరీక్షను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే, నిన్న రాత్రి బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ గవర్నర్‌ను కలిసి, బలపరీక్షకు సీఎంను ఆదేశించాలని కోరారు. 39 మంది శివసేన ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారనీ, సర్కారు మైనారిటీలో పడిందని రాసిన లేఖను ఆయనకు అందజేశారు.

ఈ క్రమంలో గవర్నర్.. బలపరీక్షను నిరూపించుకోవాలని మంగళవారం అర్థరాత్రే ఠాక్రే సర్కారును ఆదేశించారు. మరోవైపు, గువాహటిలో ఉన్న ఏక్ నాథ్ శిందే ఈ ఉదయం స్థానిక కామాఖ్య ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ”రేపు మేమంతా ముంబైకి తిరిగి వెళ్తున్నాం. శివసేన పార్టీలో 2/3 వంతుల మెజార్టీని నిరూపించుకునేందుకు నేను సిద్ధంగా ఉన్నాను” అని ఆయన అన్నారు. దీంతో రేపు ముంబైలో ఏం జరుగబోతుంది అనే ఉత్కంఠ అందరిలో మొదలైంది.