పార్శిల్లో కొందరికి అప్పుడప్పుడు ఇటుకలు, చెత్త, పళ్లు, ఒకటి ఆర్డర్ చేస్తే ఇంకొకటి రావడం చూశాం. అయితే కొందరికి పార్శిల్లో చెత్త వచ్చింది. తాము ఏం ఆర్డర్ చేయకుండానే ఈ చెత్త ఎవరు పంపారబ్బా అని ఫ్రమ్ అడ్రస్ చూసి నాలుక కరుచుకున్నారు. అందులో వచ్చిన ఓ లేఖ చదివి తమ తప్పిదాన్ని గుర్తించి లెంపలు వేసుకున్నారు. ఇంతకీ వాళ్లు చేసిన తప్పిదం.. చెత్త వేయకూడని చోట చెత్త వేయడమే. వారి నిర్లక్ష్యాన్ని గుర్తిస్తూ ఆ చెత్తను వారి ఇంటికే పార్శిల్ పంపింది ప్రభుత్వం. ఈ వినూత్న ఆచారానికి తెరలేపింది థాయ్‌ల్యాండ్ ప్రభుత్వం. కరోనా లాక్డౌన్ అనంతరం చాలాకాలానికి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పర్యాటక రంగానికి అనుమతి లభించిన విషయం తెలిసిందే. దీంతో థాయ్‌ల్యాండ్‌లో పర్యాటకం తిరిగి ఊపందుకుంది. థాయిలాండ్ వచ్చిన టూరిస్టులు తప్పనిసరిగా కవో యాయ్ అనే జాతీయ పార్కును సందర్శిస్తారు.
ప్రపంచంలో అద్భుతమైన ఈ జాతీయ పార్క్ ట్రెక్కింగ్‌లకు అనుకూలంగా ఉంటుంది. దీంతో అక్కడ ట్రెక్కింగ్ల కోసం టెంట్లను అద్దెకు ఇస్తుంటారు. అలా సరదాగా ట్రెక్కింగ్‌కు వచ్చిన టూరిస్టులు, చెత్త చెదారాన్ని టెంటుల వద్దే వదిలేసి వెళ్లిపోతున్నారు. తిను బండారాల ప్యాకెట్లు, నీళ్లు, కూల్‌డ్రింక్స్ బాటిళ్లతో చెత్త నిండిపోతోంది. దీనిపై గుర్రుగా మారింది ప్రభుత్వం. వచ్చామా, ఎంజాయ్ చేశామా, పాడు చేసి వెళ్లిపోయామా అన్నట్టు ప్రవర్తిస్తున్న టూరిస్టులకు బుద్ధి చెప్పాలని అక్కడి ప్రభుత్వం, పార్క్ యాజమాన్యం భావించింది. దీంతో రంగంలోకి దిగి చెత్త పార్శిల్‌ను టూరిస్టుల చిరునామాలకు పంపుతోంది. టెంట్లు బుక్ చేసుకునే సమయంలో ఇచ్చిన చిరునామా ఆధారంగా వారు వదిలేసిన చెత్తను పార్శిల్ చేసి వారికే పంపిస్తున్నారు. ఈ మేరకు ఆ దేశ పర్యావరణ శాఖామంత్రి వరావుత్ సిల్పా ఇటీవల సోషల్‌మీడియాలో ఓ ప్రకటనలో వెల్లడించారు.