రెండు తెలుగు రాష్ట్రాల్లో గంజాయి సాగు, రవాణా, వాడకం వంటి కార్యకలాపాల్లో పాల్గొని అనేక మంది యువత పెడదారి పడుతున్నారని మనం రోజూ వార్తల్లో వింటూంటాం. దొరికిన వారిని పోలీసులు కేసులు పెట్టి జైల్లో వేసిన సందర్భాలు కూడా మన దగ్గర చాలా ఉన్నాయి. దీనికి కారణం ఏమిటంటే.. గంజాయి అనేది మాదకద్రవ్యం. ఈ మత్తులో పడి యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నందువల్లే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. మన సంగతలా ఉంచితే ప్రపంచంలో గంజాయిని చట్టబద్ధం చేసిన దేశాలు చాలా ఉన్నాయి. అగ్రరాజ్యమైన అమెరికాలోని చాలా రాష్ట్రాలు గంజాయి సేవించడం తప్పేమీ కాదని కొత్త నిబంధనలు రూపొందించాయి. ఇప్పుడు తాజాగా మరో దేశం గంజాయి సాగుని చట్టబద్దం చేసింది. అదే థాయిలాండ్.
మన పూరీ జగన్నాధ్ రెగ్యులర్గా సినిమా షూటింగులకు వెళ్లే దేశం. చట్టబద్దతకు సంబంధించిన విషయాన్ని అక్కడి ఆరోగ్య శాఖ మంత్రే స్వయంగా వెల్లడించడం విశేషం. అయితే దీనికి కారణం ఉంది. థాయిలాండ్ యొక్క ప్రధాన ఆదాయ వనరు పర్యాటకం. కానీ, కరోనా వల్ల అది చాలా వరకు దెబ్బతింది. దీంతో ఆదాయం కోసం గంజాయి సాగును ప్రోత్సహించాలని ఆ దేశం నిర్ణయించింది. దీనివల్ల రైతులతో పాటు ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుందనే కోణంలో నిబంధనలు మార్చారు. అంతేకాక, ప్రభుత్వమే సుమారు 10 లక్షల మొక్కలను ఇంటింటికీ సరఫరా చేస్తుంది. వీటిని తమ ఇళ్లలో కానీ, పొలాల్లో కానీ లేదా వాణిజ్యపంటల లాగా కూడా సాగు చేసుకోవచ్చు. దీని వల్ల సుమారు 300 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆ దేశం అంచనా వేస్తుంది.