thailand happiest person jon jandai
mictv telugu

లైఫ్ ఈజ్ సింపుల్: వరల్డ్ హ్యాపీయెస్ట్ పర్శన్ జోన్ జెండాయ్

December 23, 2022

thailand happiest person jon jandai, world, tailand

జీవితంలో నేను నేర్చుకున్నది, తెలుసుకున్నది, ఎప్పటికి చెప్పగలిగేది ఒకే ఒక మాట ఉంది. అది ఏమిటంటే ” Life Is Simple”. అవును నిజంగానే జీవితం చాలా సరదా అయినది. చాలా సాధారణమైనది కూడా. కానీ మనుషులు దేనికోసమో పాకులాడుతుంటారు. ఎదుటివారితో తమను పోల్చుకుంటూ అసంతృప్తిగా ఉంటారు. అందుకే ఎప్పుడూ విచారంలో మునిగి తేలుతుంటారు. తమకున్న కాస్త ఆనందాన్ని కూడా మర్చిపోయి ఏదో బతుకు బతుకుతుంటారు అంటున్నాడు ప్రపంచపు అత్యంత సంతోషకరమైన వ్యక్తి జోన్ జెండాయ. తనకు కూడా ఇది తెలుసుకోవడానికి చాలా సమయం పట్టిందని చెబుతున్నాడు. అయితే తాను తొందరగానే రియలైజ్ అయ్యానని ఇప్పడు తన ఆనందాన్ని తన నుంచి ఎవరూ దూరం చేయలేరని అంటున్నారు.

జోన్ జెండాయ్ ఈశాన్య థాయ్ లాండ్ కు చెందిన వ్యక్తి. అతను పుట్టింది ఒక చిన్న గ్రామంలో. అతని చిన్నప్పుడు అక్కడ కనీసం టీవీ కూడా ఉండేది కాదుట. కానీ మనుషులు అందరూ ఆనందంగా, హాయిగా బతికేవారని చెప్పారు. అయితే వారి ఊరిలోకి టీవీ వచ్చింది. దాంతో అందరిలో మార్పు రావడం మొదలైంది. అలాగే జోన్ జెండాయ్ ఆలోచనల్లో కూడా. అప్పటివరకూ బాగానే ఉన్న జీవితం బాగోలేదనిపించింది. చాలా పేదరికంలో ఉన్నట్టు అనిపించడం ప్రారంభమైంది. బ్యాంకాక్ వెళ్ళాలనే ఆలోచనలు ఎక్కువయి, అడుగులు అటే దారి తీశాయి. బ్యాంకాక్ చేరుకున్న జోన్ జెండాయ్ బతకాడానికి చాలా పనులు చేశారు. కానీ ఎంత చేసినా తినడానికి మాత్రమే సరిపోయేది. చేతిలో చిల్లిగవ్వ కూడా మిగల్లేదు. కష్టపడిన శక్తి అంతా వృధాగా పోతోంది అనిపించిందట. అప్పడు చదువుకోవడం ప్రారంభించాను అని అంటున్నారు జోన్. అయితే అక్కడ కూడా తాను ఇమడలేకపోయారుట. ఎందుకంటే యూనివర్శిటీల్లో చదువుకోవడం చాలా బోరింగ్ అనిపించిందట. అక్కడ పని చేస్తున్న ఉపాధ్యాయుల్లో ఉన్నది విధ్వంసక జ్ఞానం అనిపించింది. వాళ్ళు చెప్పింది బతకడానికి ఎందుకూ పనికి రాదనే విషయం బోధపడింది అంటున్నారు.

జీవితం చాలా కష్టంగా అనిపించింది, అప్పడు నేను నిరాశకు గురయ్యాను అంటారు జోన్ జెండాయ్. నేను ఆలోచించడం మొదలుపెట్టాను, నేను అసలు బ్యాంకాక్‌లో ఎందుకు ఉండాలి? నా చిన్నప్పుడు మా పల్లెలో ఎవరూ రోజుకి ఎనిమిది గంటలు పని చేయడం నేను ఎప్పుడు చూడలేదు అక్కడ ప్రతి ఒక్కరూ రోజుకు రెండు గంటలు, సంవత్సరానికి కేవలం రెండు నెలలు పనిచేశారు, ఒక నెలలో వరినాట్లు నాటడం, మరో నెలలో వరి కోయడం అనేదే పని. మిగిలినది అంతా ఖాళీ సమయం, పది నెలల ఖాళీ సమయం. అందుకే మా థాయ్‌లాండ్‌లో ప్రజలు చాలా పండుగలను కలిగి ఉన్నారు. ప్రతి నెలా మాకు ఒక పండుగ ఉంటుంది. ఎందుకంటే జీవితం గడపడానికి, జీవితాన్ని పండగ చేసుకొడానికి అక్కడ చాలా ఖాళీ సమయం ఉంది. జీవితం పండగ కావడం కన్నా జీవితం మరింకేం కోరుకుంటుంది? అనిపించింది.ఊళ్ళో జనాలకు ఏం ఉన్నా లేకపోయినా చాలా సమయం ఉండేది. వారికి తమతో తాము ఉండటానికి సమయం ఉంది. తమతో తాము ఉండటానికి సమయం ఉన్నప్పుడు మనిషికి తనను తాను అర్థం చేసుకోడానికి సమయం ఉంటుంది. ప్రజలు తమను తాము అర్థం చేసుకున్నప్పుడు వారు తమ జీవితంలో ఏమి కోరుకుంటున్నారో సులభంగా, స్పష్టంగా గ్రహించగలరు.అప్పుడే ఆనందంగా ఉండగలరనిపించింది అని తన అనుభవాలను చెబుతున్నారు.

ఆ తరువాత జోన్ జెండాయ్ తన సొంత ఊరుకు వచ్చేసారు. తనకున్న పొలంలోనే కష్టపడి పని చఏశారు. దానికి తగ్గ పలితం వస్తూనే ఉంది. ఇప్పడు ఆయనకు మూడు ఇళ్ళు, కావల్సినంత సమయం ఇంకెంతో ఆనందం ఉంది. మొదలు నుండి ఇప్పటి వరకు, నేను నేర్చుకున్నది నాలుగు ప్రాథమిక అవసరాలు: ఆహారం, ఇల్లు, బట్టలు మరియు వైద్యం. ఈ నాలుగు- ప్రపంచంలో అందరికి చౌకగా మరియు అందుబాటులోకి సులభంగా ఉండాలి. నాకరికత అంటే అర్థం అదే. కానీ మనం వందలూ, వేలు కాదు ఈ కేవల నాలుగు సంఖ్హ్యల విషయాలను పొందడానికి ఈ భూమి మీద నివసించే అనేక మందికి కష్టతరం చేసి పెట్టాము. ఇప్పుడు మనం బ్రతుకుతున్న బ్రతుకు ఏ విధంగా నాగరికమైనదో దానిని చూసి మనం ఎలా గర్వంగా పడగలమో నాకు తెలియడం లేదు. ఈ భూమిపై ఇప్పుడు ఉన్నది అత్యంత నాగరికమైన యుగం అని భావించేవారు ఉన్నారు. భూమిపై చాలా విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, మన దగ్గర మహా మహా విశ్వవిద్యాలయాల చదువు పూర్తి చేసిన చాలా మంది వ్యక్తులు ఉన్నారు. ఈ భూమిలో అసాధారణమైన అత్యంత తెలివైన వ్యక్తులు ఉన్నారు. మేధావులు, శాస్త్రవేత్తలు, రాజకీయనాయకులు.. ఒక్కరని కాదు, రకరకాలు. కానీ, జీవితం ఎలా ఉంది అంటారు? కష్టంగా ఉంది కష్టాతి కష్టంగా ఉంది. ఇంత కష్టం మనం ఎవరి కోసం పడుతున్నట్టు? దేనికోసం పరిగెడుతున్నట్లు? అని ప్రశ్నిస్తున్నారు జోన్ జెండాయ్.

ఈ నడుస్తున్న జీవన విధానం తప్పు అని నాకు అనిపిస్తోంది, ఈ తరహా జీవన విధానం సాధారణమైనది కాదు, ప్రాకృతమైనది కాదు. కాబట్టి, నేను దానినుండి సాధారణ మానవ స్థితికి రావాలనుకుంటున్నాను. మనిషి ఒక సాధారణత్వానికి మరలిపోవాలి. అతను జంతువులతో సమానంగా ఉండాలి.మీరంతా సాధారణ మార్గంలో అనుకునే ఒక అసాధారణమైన రీతిలో జీవిస్తున్నారు. మీకు తెలియదు, మీకు మీ గురించి ఆలోచించే సమయం, స్వేచ్చ లేదు. కష్టపడండి కానీ అది ఎందుకో తెలుసుకుని పడండి అని సూచిస్తున్నారు జోన్. జీవితం నాకు ఇప్పుడు సులభంగా, తేలికగా ఉంది. అది నాకు చాలు. అది నాకు చాలా ఎక్కువ. ప్రజలు ఏమైనా అనుకోవచ్చు. వారు అనుకోడాన్ని, వారి అభిప్రాయాలను మార్చడానికి, నచ్చచెప్పడానికి నేను ఏమీ చేయలేను. నేను చేయగలిగేది ఒక్కటే, నన్ను, నా మనసును మార్చుకోవడం. నా మనస్సును నేనే నిర్వహించుకోవడం. ఎంపిక అనేది ఎవరికి వారి వ్యక్తిగత ఎన్నిక. మీకు ఏం కావాలో మీరు మీరు ఎంపిక చేసుకోవచ్చు. సులభంగా నుండి కష్టంగా ఉండటానికి ఎంపిక. కష్టంగా నుండి సులభంగాఉండటానికి ఎంపిక, అది మీ పై ఆధారపడి ఉంటుంది.

ఈ సాధారణతే జోన్ ను విలక్షణంగా నిలబెట్టింది. ప్రపంచం అంతా అతని వైపు చూసేలా చేసింది. జోన్ ను ఇప్పడు చాలా యూనివర్శిటీలు మాట్లాడేందుకు పిలుస్తున్నారు. టెడ్ టాక్ లో కూడా చాలా సార్లు జోన్ తన అనుభవాలను పంచుకున్నారు. అంతేకాదు తనలాంటి భావసారూప్యత కల వారితో కలిసి చింగ్ మాయిలో “పన్ పన్ ‘అనే కార్యశాలని ప్రారంభించారు.మా ఆలోచనల ప్రధాన లక్ష్యం కేవలం విత్తనాన్ని సేకరించడమే! విత్తనాన్ని కాపాడటమే.! విత్తనం అంటే ఆహారం, ఆహారం అంటే జీవితం. విత్తనం లేకపోతే, జీవితం లేదు. విత్తనం లేదంటే స్వేచ్ఛ లేదు. విత్తనం లేకపోతే ఆనందం లేదు. ఎందుకంటే మన జీవితం ఆహారం పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి విత్తనాన్ని కాపాడటం చాలా ముఖ్యం. అందుకే విత్తనాల పొదుపుపై ​​దృష్టి పెట్టాం అని చెబుతున్నారు ఈ వరల్డ్ హ్యాపీయెస్ట్ పర్శన్.అంతేకాదు ఈ పన్ పన్ లో జీవితాన్ని సాధారణంగా ఎలా గడపాలో కూడా నేర్పిస్తున్నారు జోన్. తమకు ఉన్నదానిలోనే మనుషులు ఎంత ఆనందం వెతుక్కోవచ్చో తెలుసుకోవడం చాలా ముఖ్యమని అందుకే జీవితాన్ని మళ్ళీ నేర్చుకోవడం, సులభతరం చేసుకోవడం చాలా అవసరం అని అంటున్నారు.