రాజు కాదు, రాక్షసుడు.. థాయ్‌లాండ్ కింగ్ దుర్మార్గాల చిట్టా  - MicTv.in - Telugu News
mictv telugu

రాజు కాదు, రాక్షసుడు.. థాయ్‌లాండ్ కింగ్ దుర్మార్గాల చిట్టా 

October 22, 2020

Thailand king maha story Vajiralongkorn

అనగనగా ఒక దేశం. ఆ దేశానికి మహారాజు. రాజులకు ఉండాల్సిన అవలక్షణాలన్నీ ఉన్నాయి. దురాశ ఉంది. అంతులేని కామం ఉంది. కోపం ఉంది. నోటితో చెప్పడానికి కూడా వీలుకాని దారుణాన్నీ అతడు చక్కగా పూర్తి చేస్తుంటాడు. అతని పీడ వదిలించుకోడానికి జనం తిరగబడుతున్నారు..!

ఇది చందమామ పుస్తకాల్లోని కథ కాదు. ఇప్పుడు జరుగుతున్న కథ. మనదేశానికి కాస్త దగ్గర్లోనే సాగుతున్న కథ. ‘మాకు నువ్వొద్దురా బాబూ, గద్దె దిగిపో’ అని ప్రజలు రోడ్లపైకి వస్తున్న థాయ్‌లాండ్ కథ. థాయ్‌లాండ్ రాజు మహా వజిరలోంగ్‌కర్న్ అత్యంత దుర్మార్గ పాలన సాగిస్తున్నాడు. అటు వ్యక్తిగత జీవితంలో, ఇటు ప్రజాజీవితంలో ఏమాత్రం సిగ్గూ ఎగ్గూ లేకుండా బతుకుతున్నాడు.  ప్రజాధనంలో విలాసాల్లో మునిగితేలుతూ వారినే రాచిరంపాన పెడుతున్నాడు. 

Thailand king maha story Vajiralongkorn

68 ఏళ్ల ఈ ముసలి రాజు ప్రపంచంలోనే అత్యంత ధనికరాజు. మహా వద్ద 22 వేల కోట్ల రూపాయల ఆస్తి ఉంది. ఇద్దరు భార్యలు చనిపోగా, ఇద్దర్ని వదిలేశాడు. ప్రస్తుతం ఇద్దరు భార్యలు ఉన్నారు. తాజా భార్య నిరామన్ ఆర్మీలో పనిచేస్తోంది. మహాకు భార్యలతోపాటు పెద్దసంఖ్యలో ప్రియురాళ్లు ఉన్నారు. వారితో కలిసి డేటింగ్‌కు వెళ్లడం అతనికి ఓ సరదా.  

Thailand king maha story Vajiralongkorn

మహా ఓ భార్యను అర్ధనగ్నంగా మార్చి కుక్కలు తినే బొచ్చెలో ఆమెకు తిండి పెడతాడని ప్రచారంలో ఉంది. అంతేకాకుండా రాజభవనంలోని ఉద్యోగులకు గుండుకొట్టించి మోకాళ్ల మీద పాకిస్తాడని కూడా చెబుతారు. అయ్యగారి లీలలు అంతటితో ఆగలేదు. అతనికి ఇదివరకు ఓ పెంపుడు కుక్క ఉండేది. దానికి వాయిసేన అధికారులు తొడుక్కునే యూనిఫామ్ వేసి, ఎయిర్‌ఫోర్స్‌‌లో ఉద్యోగం ఇప్పించాడు. వాయుసేన అధికారులు దానికి కూడా సెల్యూట్ చేశారు. 

Thailand king maha story Vajiralongkorn

ఈ లోకంలో ఎంత దుర్మార్గుడికైనా పిల్లలపై ప్రేమ ఉంటుంది. మహాకు అది కూడా లేదు. నలుగురు పిల్లలను బజారులో పడేశాడని, వాళ్ల స్కూలు ఫీజులు కూడా కట్టలేదని ఆరోపణలు ఉన్నాయి. 

ఇన్ని ఘోరాలు చేస్తున్నా థాయ్‌లాండ్ సామాన్య ప్రజలు రాజును పైకి పల్లెత్తు మాట అనరు. రాజు సాక్షాత్తూ దేవుడి అవతారమని, ఆయనను తిట్టకూడదని భావిస్తుంటారు. రాజకుటుంబాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన ఓ వ్యక్తికి 35 ఏళ్ల జైలు శిక్ష పడింది. రాజును తిట్టే నినాదంతో కూడిన టీషర్టును వేసుకున్నందుకు ఓ యువకుణ్ని పిచ్చాస్పత్రికి తరలించారు. రాజును విమర్శించిన మరెందరో ఆచూకీ లేకుండా పోయారు. ఈ బాధలు భరించలేక జనం తిరగబడుతున్నారు. తమ బాగోగులు పట్టించుకోని రాజు తమకొద్దని రోడ్లపైకి వస్తున్నారు. అయినా మహా లెక్కచేయడం లేదు. ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని బలహీనపరుస్తున్నాడు. చట్టాలను తనకు అనుకూలంగా తయారు చేసుకుంటున్నాడు. థాయ్‌లాండ్ ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉంది.  

Thailand king maha story Vajiralongkorn