కైకాల భౌతికకాయానికి చిరు, పవన్ నివాళి… ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
టాలీవుడ్ సీనీయర్ నటుడు కైకాల సత్యనారాయణ మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తెల్లవారు జామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. కైకాల మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. రేపు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో కైకాల అంత్యక్రియలను నిర్వహించనున్నారు. కైకాల పార్థీవదేహాన్ని నివాళులు అర్పించేందుకు ప్రముఖులు తరలివస్తున్నారు. కైకాల సత్యనారాయణ పార్థివదేహం వద్ద అగ్ర కథనాయకులు చిరంజీవి, పవన్,వెంకటేష్, రాఘవేంద్రరావు, మోహన్ బాబు, త్రివిక్రమ్, నివాళులర్పించారు. కైకాల కుటుంబ సభ్యులతో మాట్లాడి చిరంజీవి వారిని ఓదార్చారు. ఆ సమయంలో మెగాస్టార్ కంటతడి పెట్టారు.
కల్మషం లేని వ్యక్తి
కైకాల సత్యనారాయణ భౌతికంగా దూరమవ్వడం మా దురదృష్టం అని చిరంజీవి అన్నారు. కైకాల మా కుటుంబ పెద్ద.. రామలింగయ్య కుటుంబానికి అతి దగ్గర వ్యక్తి అని చెప్పారు.
తనను తమ్ముడిలా భావించినట్లు తెలిపారు. కైకాల కల్మషం లేని వ్యక్తి స్పష్టం చేశారు. ఆయన మంచి భోజన ప్రియుడని చిరు గుర్తు చేశారు. కైకాల మృతి చాలా బాధాకరమని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్నారు.
ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కైకాల సత్యనారాయణ పార్థివదేహాన్ని దర్శించుకున్నారు. అధికారిక లాంఛనాలతో కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని తలసాని పేర్కొన్నారు.