తమసోమా జ్యోతిర్గమ మూవీ ట్రైలర్ విడుదల చేసిన కేటీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

తమసోమా జ్యోతిర్గమ మూవీ ట్రైలర్ విడుదల చేసిన కేటీఆర్

October 13, 2021

thama

చేనేత కార్మికుల కష్టసుఖాలతో తెరకెక్కిన ‘తమసోమా జ్యోతిర్గమయ’ చిత్రం ట్రైలర్ ను తెలంగాణ మంత్రి కేటీఆర్ బుధవారం ఆవిష్కరించారు. ఈ చిత్రం తెలుగు సినీ మణిహారంలో మరో ఆణిముత్యమని ఆయన కొనియాడారు. ‘‘చేనేత కార్మికుల కష్టాలను, కన్నీళ్లను, వారి శ్రమని చూపించడమే కాకుండా వారిలో ఉన్న గొప్ప కళని ప్రపంచానికి ఈ సినిమా ద్వారా పరిచయం చేసే గొప్ప ప్రయత్నం చేశారు దర్శక నిర్మాతలు. చేనేత, చేతివృతుల్లో మరెన్నో కొత్త ఆవిష్కరణలు జరగాలి. అందుకోసం ఇలాంటి చిత్రాలు సమాజానికి ఎంతో అవసరం. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని కేటీఆర్ అన్నారు.

ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు విజయ్ కుమార్ బడుగు, నిర్మాత తడక రమేష్, నటుడు ఆనంద్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రం అక్టోబర్ 29న విడుదలవుతోంది. 2000 సంవత్సరం నుండి 2014 మధ్య చేనేత ప్రసిద్ధి పొందిన పోచంపల్లిలో జరిగిన ఓ సంక్లిష్ట పరిస్థితి నుండి చేనేత పరిశ్రమను ఓ యువకుడు ఎలా గట్టెక్కించాడనే ఇతివృత్తంతో విజయ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మార్క్ కె ప్రశాంత్ సంగీతం అందించగా, శ్రవణ్ జీ కుమార్ కెమెరా, ఎడిటింగ్ అందించారు.