'Thank God at least Godse…': Owaisi on BJP MLA's ‘sanskaar’ tag on Bilkis Bano rapists
mictv telugu

‘ఆ రేపిస్టులు బ్రాహ్మణులు, సంస్కారవంతులు’.. BJP నేతలపై విరుచుకుపడ్డ ఒవైసీ

August 19, 2022

ఓ మహిళపై గ్యాంగ్ రేప్ కు పాల్ప‌డి, ఏకంగా ఆమె కుటుంబాన్ని దారుణ హ‌త్య‌కు గురి చేసిన దోషుల‌ను విడుద‌ల చేయ‌డంపై దేశ వ్యాప్తంగా నిర‌స‌న వ్య‌క్తం అవుతోంది. ఈ ఘ‌ట‌న‌పై అత్యాచారానికి లోనైన బాధితురాలి బిల్కిస్ బానో, ఆమె భ‌ర్త ఇంకా షాక్ నుంచి కోరుకోలేదు. ఇప్ప‌టి వ‌ర‌కు న్యాయం బ‌తికే ఉంద‌న్న న‌మ్మ‌కం ఉండేద‌ని కానీ దోషులు బ‌య‌ట‌కు రావ‌డంతో ఆ విశ్వాసం కూడా స‌న్న‌గిల్లింద‌ని వాపోయింది.

2002 గుజరాత్ అల్లర్ల క్ర‌మంలో.. గర్భవతి అయిన బిల్కిస్‌ బానోపై సామూహిక లైంగిక‌దాడికి పాల్ప‌డ‌టంతో పాటు ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురిని హ‌త్య చేసిన కేసులో దోషులను ఇటీవ‌ల గుజ‌రాత్ ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. అయితే, దోషులు బ్రాహ్మ‌ణులు అనీ, మంచి సంస్కారం ఉన్న‌వారంటూ బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ విషయంపై AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. బీజేపీ, గుజ‌రాత్ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు చేశారు. గుజరాత్ అయినా, కథువా అయినా రేపిస్టులకు బీజేపీ అండగా ఉంటుంద‌ని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

ఆ రేపిస్టులు ‘సంస్కార్’ ఉన్న బ్రాహ్మణులేనని గోద్రాలోని బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సీకే.రౌల్జీ చేసిన వ్యాఖ్యలపై ఒవైసీ వ్యాఖ్యానిస్తూ.. “కొన్ని కులాల వారు నేరం చేసినట్లు రుజువైన‌ప్ప‌టికీ జైలు నుండి విడుదలవుతారు. మరికొందరికి కులం లేదా మతం సరిపోతుంది..”కనీసం గాడ్సేను దోషిగా నిర్ధారించి ఉరితీసినందుకు మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. స్వాతంత్య్ర‌ దినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి మోడీ మహిళా సాధికారత గురించి నొక్కిచెప్పిన రోజునే, గుజరాత్ ప్రభుత్వం బిల్కిస్ బానో కేసు దోషులను విడుదల చేసింది” అని ఒవైసీ అన్నారు. సీబీఐ విచారణలో దోషులుగా తేలినందున గుజరాత్ ప్రభుత్వం కేంద్రం నుంచి అనుమతి తీసుకుందా? అని ప్ర‌శ్నించారు. రానున్న గుజరాత్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే బీజేపీ ఇవన్నీ చేస్తోందని ఒవైసీ ఆరోపించారు.