పెంచిన ప్రేమే గెలిచింది.. స్వరూప చెంతకు తన్విత! - MicTv.in - Telugu News
mictv telugu

పెంచిన ప్రేమే గెలిచింది.. స్వరూప చెంతకు తన్విత!

March 22, 2018

కన్నప్రేమకంటే పెంచిన ప్రేమ గొప్పదని అంటారు. భావోద్వేగంతో అలా అన్నా.. రెండు ప్రేమలూ గొప్పవే. ఒకటి రక్తమాంసాలు అందించి బిడ్డకు ఒక రూపునిస్తుంది. మరొకటి కన్నతల్లికి మించి కంటిరెప్పలా కాచి ఆ పసిగుడ్డు దేహాన్ని పెంచిపోషించి మురిసిపోతుంది. ఈ రెండు ప్రేమల మధ్య ఘర్షణ తలెత్తితే ఎలా ఉంటుందో నాలుగేళ్ల తన్విత ఉదంతం మనకు వివరించింది. ఆ చిన్నారిని ఎవరికి అప్పగించాలన్నదానిపై కోర్టులో నడుస్తున్న కేసు ఒక కొలిక్కి వచ్చింది. పాపను పెంచిన తల్లి స్వరూపకే అప్పగించే అవకాశమున్నట్లు విశ్వసనీయ సమాచారం.కొత్తగూడెం భద్రాద్రిజిల్లా యల్లందుకు చెందిన ఉమ, మాలోతు బావో సింగ్ దంపతుల బిడ్డ తన్విత. అయితే పేదరికం వల్ల గర్భంతో ఉన్నప్పుడే పుట్టేబిడ్డను మాణిక్యవరానికి చెందిన వేముల స్వరూప, రాజేంద్ర దంపతులకు ఇస్తామని ఉమ ఒప్పందం చేసుకుంది. దాని ప్రకారం తన్విత వేముల ఇంటి పిల్లయింది. కానీ తర్వాత ఉమ పశ్చాత్తాపంతో అసలు విషయం బయటపెట్టి తన బిడ్డ తనకే కావాలని పోలీసులను ఆశ్రయించింది. విచారణ ముగిసేవరకు పాపను శిశు సంక్షేమ గృహంలో ఉంచాలని కోర్టు ఆదేశించింది.కేసుతో విసుగెత్తిన ఉమ దంపతులు.. పాపను వేముల దంపతులకే ఇచ్చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ‘తన్వితను అలా అనాథలా ఉంచడం కంటే పెంచిన తల్లికే ఇచ్చేస్తేనే మంచిది’ అని మాలోతు బావో సింగ్ మీడియాతో అన్నాడు. ఉమకు ఇది ఇష్టం లేకపోయినా కోర్టు ఖర్చులకు డబ్బు లేకపోవడం, పేదరికం వంటి కారణాలతో ఆమె కూడా మెత్తబడింది. తన కన్నబిడ్డను స్వరూప దంపతుకు ఇచ్చేయానికి మనస్ఫూర్గిగా అంగీకరిస్తున్నట్టు ఉమ ఇటీవల కొత్తకూడెం కోర్టుకు తెలిపినట్లు సమాచారం. కోర్టు, వాయిదాల కోసం 3 లక్షలు ఖర్చు చేశానని, ఇక పోరాడేశక్తి లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది.

మరోపక్క.. తీర్పు తమకే అనుకూలంగా వస్తుందని స్వరూప దంపతులు ఆశాభావంతో ఉన్నారు. ‘నా భార్య తీవ్ర మనోవేదనతో ఉంది. ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకుంది. అయితే ఉమ అంగీకారంతో మాలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి..’ అని రాజేంద్ర చెప్పాడు.

ఒక తల్లి తన కడుపున పుట్టిన బిడ్డను వదిలేసుకోవాల్సిన పరిస్థితి కల్పించిన సమాజంలో మార్పురానంత కాలం, ఆర్థిక అసమానతలు పోనంత కాలం ఉమలాంటి తల్లుల వ్యథాగాథలు కొనాసాగుతూనే ఉంటాయి.