ఆయా అరాచకం.. పసివాడి మూతికి వాత - MicTv.in - Telugu News
mictv telugu

ఆయా అరాచకం.. పసివాడి మూతికి వాత

April 23, 2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాలో ఓ ఆయా పసివాడి పట్ల అరాచకంగా ప్రవర్తించిన సంఘటన కలకలం రేపింది. మూడేళ్ల వయసున్న పసివాడి మూతికి వాత పెట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. కోవూరునగర్ అంగన్ వాడీ కేంద్రంలో లక్ష్మి అనే మహిళ తన మూడేళ్ల కుమారుడు అయిన ఈశ్వర కృష్ణను తీసుకెళ్లి వదిలి పెట్టింది. కొద్దిసేపటికే ఆ పసివాడు అమ్మ కావాలంటూ ఏడవటం మొదలుపెట్టాడు. దీంతో అంగన్‌వాడీ కేంద్రం సహాయకురాలు వంటగదిలోకి తీసుకెళ్లి, కడ్డీతో మూతి మీద వాత పెట్టింది.

దీంతో ఆ పసివాడు బాధ తట్టుకోలేక విలవిల్లాడుతూ పక్కనే ఉన్న ఇంటికి పరిగెత్తాడు. వెంటనే ఆయా అతడి వెంట పడి.. ఓ చెట్టు కొమ్మతో కొట్టుకుంటూ మళ్లీ కేంద్రానికి తీసుకొచ్చింది. అనంతరం శుక్రవారం ఉదయం కుమారుడి మూతి మీద వాత చూసిన బాలుడి తండ్రి విషయం తెలుసుకుని అంగన్ వాడీ కేంద్రానికి వెళ్లి, ఆయాను నిలదీశాడు. ఆమె సరైన సమాధానం చెప్పకుండా ఎదురు తిరగడంతో అనుమానం వచ్చింది. చిన్నారి మూతిపై వాత మాత్రమే కాకుండా వీపు, తొడలపైనా కొట్టినట్లు చారలు పడ్డాయి. ఏం జరిగిందో అసలు విషయం చెప్పాలంటూ ఆ బాలుడి తల్లిదండ్రులు గట్టిగా నిలదీయటంతో అసలు నిజం బయటపడింది.

ఈ ఘటనపై అనంతపురం సీడీపీఓ, ఐసీడీఎస్ లలిత స్పందిస్తూ.. చిన్నారిని కొట్టారన్న విషయమై మాకు ఎలాంటి ఫిర్యాదు రాలేదు. అసలు అక్కడ ఏం జరిగిందో అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లి, విచారిస్తానని తెలిపింది. నిజమని తేలితే వెంటనే చర్యలు తీసుకుంటాను అని లలిత పేర్కొన్నారు.