That feat is only possible for the Nandamuri family: Balakrishna
mictv telugu

ఆ ఘనత నందమూరి ఫ్యామిలీకే సాధ్యం: బాలకృష్ణ

August 14, 2022

టాలీవుడ్‌లో గతకొన్ని నెలలుగా కొత్త కొత్త కథలతో, విభిన్న సినిమాలను తెరకెక్కిస్తూ, యంగ్ డైరెక్టర్లు అటు ప్రజల్లో, ఇటు సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపును తెచ్చుకుంటున్నారు. ఇందులో భాగంగా మొదటి అవకాశంలోనే వశిష్ఠ అనే యంగ్ డైరెక్టర్ ‘బింబిసార’ లాంటి అద్భుత చిత్రాన్ని తెరకెక్కించి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. ‘బింబిసార’ సినిమా విడుదలైన రోజు నుంచి ఈరోజు వరకు కలెక్షన్ల వర్షం కురిపిస్తూ, అందరి చేత ప్రశంసలు అందుకుంటుంది.

ఈ క్రమంలో టాలీవుడ్ నటసింహాం నందమూరి బాలకృష్ణ తాజాగా కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ‘బింబిసార’ సినిమాను వీక్షించారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ..”ఇండస్ట్రీలో కొత్త వారికి సైతం గొప్ప అవకాశాలిచ్చిన ఘనత కేవలం నందమూరి కుటుంబానికే దక్కుతుంది. సినిమా చాలా అద్భుతంగా ఉంది. హ్యాట్సాప్ కల్యాణ్.. ఇలాంటి మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించినందుకు..నువ్వు మరిన్ని సినిమాలు అందించాలని బాబాయ్‌గా కోరుకుంటున్నా. వశిష్..చిత్రాన్ని చాలా చక్కగా తెరకెక్కించావు. త్వరలోనే మనం కలిసి పనిచేద్దాం. మీలాంటి టాలెంట్ ఉన్న యువత ఎంతోమంది ఇండస్ట్రీలోకి రావాలి. మంచి పేరు, గుర్తింపు సొంతం చేసుకోవాలి. ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకెళ్లడం వేరు. కానీ, మొదటి ప్రయత్నంలోనే ఇలాంటి గొప్ప చిత్రాన్ని తెరకెక్కించావు. టాలెంట్‌ని నమ్మి కొత్తవారికి సైతం గొప్ప అవకాశాలివ్వడం నందమూరి వంశానికి దక్కుతుంది” అని ఆయన అన్నారు.

ఇక, బింబిసార విషయానికొస్తే..టైమ్ ట్రావెల్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న సోషియో ఫాంటసీ చిత్రం. ఇదొక కల్పిత కథ. ఇందులో కల్యాణ్ రామ్ క్రూరమైన రాజు బింబిసార పాత్రలో నటించారు. రాజ్యకాంక్షతో అతడు ఇతరుల్ని ఎలా ఇబ్బందులకు గురి చేశాడు? టైమ్ ట్రావెల్ చేసి తన తప్పులు ఎలా సరి చేసుకున్నాడు? అనే ఆసక్తికర అంశాలతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. సినిమాలో హీరోయిన్స్‌గా సంయుక్తా మేనన్, కేథరిన్ నటించారు. ఆగస్టు మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టి సూపర్ హిట్‌గా నిలిచింది.