పంజాబ్ రాష్ట్రంలో నేడు వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ఆమ్ఆద్మీ పార్టీ విజయ ఢంకా మోగించింది. అధికార పార్టీ కాంగ్రెస్‌ను అడ్రస్ లేకుండా చేసింది. ఇంతటి విజయానికి కారకులు ఎవరు? ఎవరు ఎక్కువగా మద్ధతు ఇచ్చారు? అనే విషయాలను, తమ గెలుపుకు గల కారణాలను ఆ పార్టీని స్వయంగా వెల్లడించింది. ఈ గెలుపుకు ప్రధాన కారణం పంజాబ్ రైతులు మద్దతు ఇవ్వడం వల్లే అని పేర్కొంది. అందుకు పంజాబ్ రైతులకు, యువత, మహిళా ఓటర్లకు ధన్యవాదాలు తెలిపింది.
విజయానికి ముఖ్య కారణాలు ఇవే..
పంజాబ్‌ను 70 ఏళ్ల పాటు శిరోమణి అకాళీదళ్- బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే పాలించాయి. కానీ అనుకున్నంత అభివృద్ధి జరగలేదు. దీంతో ఓటర్లు ఆమ్ ఆద్మీకి పట్టం కట్టారు. ముఖ్యంగా మాల్వా ప్రాంత రైతులు మార్పును కోరుకున్నారు. దీనికి తగ్గట్టే అక్కడి రైతులు ఓ స్లోగన్ కూడా ఇచ్చారు. ‘ఈసారి తమను మోసం చేయలేరని, కేజ్రీవాల్ సారథ్యంలోని భగవంత్‌మాన్‌ను గెలిపించుకుంటాం’ అని ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చారు. పైగా మాల్వా ప్రాంతానికి చెందిన భగవంత్ మాన్‌ను సీఎం అభ్యర్ధిగా పార్టీ అధినేత కేజ్రీవాల్ ప్రకటించారు.
అంతేకాకుండా భగవంత్ మాన్ పంజాబ్‌లో బలమైన సామాజికవర్గంగా ఉన్న సిక్కు జాట్ వర్గానికి చెందిన వ్యక్తి దీంతో అన్ని రకాలుగా ఆమ్ఆద్మీ పార్టీకి కలిసి వచ్చింది. ఢిల్లీ మోడల్ డెవలప్మెంట్ అందిస్తానన్న కేజ్రీవాల్ పిలుపును పంజాబ్ ఓటర్లు విశ్వసించారు. నాణ్యమైన చదువు, నాణ్యమైన చవకైన వైద్యం, తక్కువ ధరకే విద్యుత్, నీరు అనే ఈ నాలుగు అంశాలే ఢిల్లీ అభివృద్ధికి కారణం అంటూ కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. పంజాబ్‌లో విద్యుత్ ధరలు అధికంగా ఉన్నాయి. ప్రభుత్వాసుపత్రులు, ప్రభుత్వ పాఠశాలలను పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఈ చదువు, వైద్యం, విద్యుత్, వాటర్ అంటూ హామీలివ్వడంతో ఓటర్లు ఆప్ వైపు చూశారు.
మరోపక్క కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రైతులు ఏడాదికి పైగా నిరసనలు తెలపడం తెలిసిందే. బీజేపీపై వారి వ్యతిరేకత ఆప్‌కు సానుకూల అంశంగా మారింది.