That movie gave me life: Chiranjeevi
mictv telugu

నాకు ప్రాణం పోసింది..ఆ సినిమానే: చిరంజీవి

September 23, 2022

తెలుగు ప్రేక్షకులను ఆనాటి నుంచి ఈనాటి వరకు తనదైన నటనతో, డ్యాన్స్‌తో, డైలాగులతో, హావభావాలతో ఆకట్టుకుంటూ, ఆపదలో ఉన్న సినీ కార్మికులకు అండగా ఉంటూ, సోషల్ మీడియా వేదికగా తన కొత్త సినిమా అప్‌డేట్స్‌ను అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటున్నారు మెగస్టార్ చిరంజీవి. ఆయన తాజాగా అభిమానులను ఉద్దేశించి చేసిన ఓ ట్విట్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

”మీకు తెలిసిన ఈ చిరంజీవి..చిరంజీవిగా పుట్టిన రోజు ఈరోజు (సెప్టెంబరు 22, 1978). ‘ప్రాణం ఖరీదు’ చిత్రంతో నాకు ప్రాణం పోసి, నా గుండె చప్పుడై, అన్నీ మీరే అయి, దాదాపుగా 44 ఏళ్లుగా నన్ను నడిపించారు. నన్నింతగా ఆదరించిన, ఆదరిస్తోన్న ప్రేక్షకాభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. కానీ, ఒక్కమాట మాత్రమే చెప్పగలను. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు” అంటూ ఓ ఎమోషనల్ ట్విట్ చేశారు.

అయితే, చిరంజీవి ఈ ఎమోషనల్ పోస్ట్ పెట్టడానికి ఓ ప్రధాన కారణం ఉంది. సెప్టెంబరు 22 అనేది చిరంజీవి కెరీర్‌లోనే ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు. ఎందుకంటే ఆయన కీలక పాత్రలో నటించిన ‘ప్రాణం ఖరీదు’ అనే సినిమా విడుదలై, నేటికి 44 ఏళ్లు పూర్తి అయ్యింది. దాంతో ఆ రోజులను చిరంజీవి ఒకసారి గుర్తు చేసుకొని, తనని ప్రోత్సహించిన అభిమానులందరికీ కృతజ్ఞతలు చెప్పారు. చిరంజీవి కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం ‘పునాది రాళ్లు. కానీ, ఆ తర్వాత నటించిన ‘ప్రాణం ఖరీదు’ ముందుగా విడుదలై, శివశంకర వరప్రసాద్‌ను చిరంజీవిగా ప్రేక్షకులకు పరిచయం చేసింది.