అందుకే ‘మా’ మీటింగ్: జీవిత - అధ్యక్ష స్థానంలో నేనే ఉండాలి: నరేష్.. - MicTv.in - Telugu News
mictv telugu

అందుకే ‘మా’ మీటింగ్: జీవిత – అధ్యక్ష స్థానంలో నేనే ఉండాలి: నరేష్..

October 21, 2019

That's why MAA model meeting Jeevitha

‘మా’ అధ్యక్షుడు నరేష్‌కు సమాచారం లేకుండా ఆదివారం మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) అత్యవసరంగా సమావేశం అయిన విషయం తెలిసిందే. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఏం జరుగుతోందనే చర్చ మొదలైంది. రకరకాల పుకార్లు చక్కర్లు కొట్టాయి. తాను లేకుండా సమావేశం నిర్వహించడంపై నరేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ జీవిత రాజశేఖర్‌ స్పందిస్తూ.. ఇది ‘మా’ ఆత్మీయ సమావేశం అని చెప్పుకొచ్చారు. ‘మా’ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఈ సమావేశం పెట్టామని.. ఈ సందర్భంగా పెట్టిన చర్చలో అందరూ చురుగ్గా పాల్గొన్నారని జీవిత చెప్పారు. ఉదయం 9గంటలకు ప్రారంభమైన సమావేశం సాయంత్రం 5గంటలకు ముగిసిందని తెలిపారు. ఈ సమావేశంలో తీవ్ర వాగ్వాదం జరిగింది. 

కొందరు సభ్యులు భావోద్వేగానికి గురయ్యారని అన్నారు. ‘అందరికీ ఉపయోగపడేలా ఈ సమావేశం జరిగింది. ‘మా’ వార్షిక సర్వసభ్య సమావేశం ఇప్పటికే ముగిసిన నేపథ్యంలో నిబంధనల ప్రకారం.. వీలైనంత త్వరగా ‘మా’ అసాధరణ జనరల్‌ బాడీ మీటింగ్‌ నిర్వహించాలని ఈ సందర్భంగా నిర్ణయించాం. దీనికై న్యాయపరమైన సలహాలు కూడా తీసుకున్నాం. సమస్యల పరిష్కరానికి ప్రత్యేక సమావేశం కావాలంటూ మొత్తం ‘మా’సభ్యుల్లో 20శాతం మంది అభ్యర్థిస్తే సమావేశం నిర్వహించుకోవచ్చని న్యాయ నిపుణులు తెలిపారు. మెజార్టీ అభ్యర్థనలు వచ్చిన 21రోజుల్లో ఈ సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది. ఈ సమావేశం జరిగితే ‘మా’కు మంచి జరుగుతుందని అందరూ భావిస్తున్నారు. ఇందుకు హాజరుకావాలి అనుకునేవారు ‘మా’ ఆఫీస్‌కు వచ్చి మద్దతు తెలుపుతూ సంతకం పెట్టాల్సి ఉంటుంది. పోస్ట్‌ ద్వారా లేఖ రాసి ‘మా’కు పంపవచ్చు. మెయిల్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటాం. ఇదే విషయాన్ని నేను చెప్పాలనుకున్నాను’ అని జీవిత తెలిపారు. ఇదిలావుండగా ఈ సమావేశంపై మా అధ్యక్షుడు నరేష్ కూడా స్పందించారు.

ఎలాంటి సభలు జరిగినా అధ్యక్ష స్థానంలో నేనే ఉండాలి.. 

అత్యవసర ‘మా’ సమావేశం గురించి మా అధ్యక్షుడు నరేష్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. మా తరఫున ఎలాంటి సభలు, సమావేశాలు జరిగినా అధ్యక్ష స్థానంలో తానే ఉండాలని అన్నారు. ఏడాదికి ఒకసారి ‘మా’లో జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుందని, ఈ 25 ఏళ్లలో ఎప్పుడూ ఇలాంటి ఎమర్జెన్సీ జనరల్ బాడీ మీటింగ్ జరగలేదని తెలిపారు. ‘సమావేశానికి హాజరుకావాలని నాకు 25 రోజుల క్రితం ఓ లేఖ వచ్చింది. అధ్యక్షుడిగా జనరల్ బాడీ మీటింగ్‌కు నేనే సభ్యులను ఆహ్వానించాలి. నాకు మరెవరో పిలవడం ఏంటని ఆశ్చర్యపోయాను. నేను అధ్యక్షుడిని అయ్యాక ఆరు నెలల్లో ఒకసారి మీటింగ్ నిర్వహించాను. మూడు ఎగ్జిక్యూటివ్ సమావేశాలు కూడా నిర్వహించాను. ఈ మీటింగ్‌పై నాకు అనుమానాలు ఉండటంతో హాజరు కాలేదు’ అని నరేష్ స్పష్టంచేశారు.