తమిళనాడు రాష్ట్రంలో ఓ 19 ఏళ్ల వయసున్న యువకుడు 15 ఏళ్ల బాలిక తనను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదని హైటెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. యువకుడు చేసిన పనికి సబర్బన్ రైళ్ల సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. విషయం తెలుసుకున్న అధికారులు ఘటన స్థలానికి చేరుకొని, విద్యుత్ సరఫరాను నిలిపివేసి అతడితో చర్చలు జరిపారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే..తమిళనాడు రాజధాని చెన్నైలోని తాంబరం శానిటోరియం ప్రాంతం క్రోంపేటలోని రాధానగర్‌లో నివాసం ఉండే కృష్ణ అనే యువకుడు.. హౌస్ పెయింటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతడు 11వ తరగతి చదువుతున్న ఓ బాలికతో కొన్ని నెలలుగా డేటింగ్లో ఉన్నాడు. ఈ క్రమంలో పెళ్లి చేసుకుందామని ఆ బాలికతో పలుమార్లు చర్చలు జరిపాడు. అందుకామె నిరాకరించింది.
దాంతో ఆ బాలికను పదే పదే బతిమాలినాడు. అయినా, ఆ బాలిక పెళ్లికి ఒప్పుకోలేదు. చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో ఇక లాభం లేదని దుర్గానగర్‌లో ఉన్న 80 అడుగుల ఎత్తైన హైటెన్షన్ విద్యుత్ టవర్‌ను ఎక్కేశాడు. దాంతో సబర్బన్ రైళ్ల సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని, ముందు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.
అనంతరం పోలీసులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు ఎంత నచ్చజెప్పినప్పటికీ అతడు కిందికి దిగలేదు. దాంతో చివరికి అతడు ప్రేమించిన ఆ బాలికను అక్కడికి తీసుకొచ్చారు. ఆమె పెళ్లి చేసుకుంటానని హామీ ఇవ్వడంతో కృష్ణ కిందికి దిగొచ్చాడు. అతడు కిందికి దిగిన వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.