వాలంటీర్లకు పేపర్ కోసం రూ.5 కోట్లు... సాక్షి అమ్మకాల కోసమే అంటున్న విపక్షాలు.. - MicTv.in - Telugu News
mictv telugu

వాలంటీర్లకు పేపర్ కోసం రూ.5 కోట్లు… సాక్షి అమ్మకాల కోసమే అంటున్న విపక్షాలు..

July 6, 2022

ఏపీలో వాలంటీర్ల వ్య‌వ‌హారం మరోసారి వార్తల్లోకి వచ్చింది. వైసీపీ నేత‌ల‌కు తొత్తులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ గతంలో ప్ర‌తిప‌క్షాల నుంచి, అటు ప్ర‌జ‌ల నుంచి కూడా తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు వచ్చాయి. ఎలాంటి సంక్షేమ ప‌థ‌కాల‌ను అయినా వారు ప్ర‌తిప‌క్షాల వారికి రాకుండా అడ్డుకుంటున్నార‌ని, కేవ‌లం అధికార పార్టీలో ఉండే కార్య‌క‌ర్త‌ల‌కు మాత్రమే చేర‌వేస్తున్నారంటూ బ‌హిరంగంగానే గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. అటు మంత్రులు కూడా వాలంటీర్లు త‌మ పార్టీ వాళ్లే అంటూ కుండ బ‌ద్ద‌లు కొట్టేస్తున్నారు.

ఈ క్ర‌మంలో జ‌గ‌న్ స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యం తీవ్ర దుమారం రేపుతోంది. వాలంటీర్లు ఇక నుంచి దిన‌ప‌త్రిక కొనుక్కోవ‌డానికి ప్ర‌భుత్వ‌మే నెల‌కు రూ.200ఇస్తుందంట‌. ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల‌ను తెలుసుకునేందుకు, ప్ర‌తిప‌క్షాలు చేసే అబ‌ద్ద‌పు ప్ర‌చారాన్ని తిప్పి కొట్టేందుకు ఈ వారికి దిన‌ప‌త్రిక అవ‌స‌ర‌మ‌ని ప్ర‌భుత్వం భావించి ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న 2.66లోల మంది వాలంటీర్ల‌కు నెల‌కు రూ.5.32కోట్లు చెల్లించ‌నుంది ప్ర‌భుత్వం. అయితే అంత‌ర్గ‌త స‌మ‌చారం ప్ర‌కారం..ఈ డ‌బ్బులు సాక్షి వార‌ప‌త్రిక కొన‌డానికే ఇస్తున్న‌ట్టు తెలుస్తోంది.

స‌ర్క్యులేష‌న్ బాగా ఉన్న పేప‌ర్‌ను కొనాలంటూ జీవోలో పేర్కొన్నారు. కానీ అంత‌ర్గ‌త ఆదేశాల ప్ర‌కారం అంద‌రూ సాక్షి దిన‌ప‌త్రిక‌నే కొనాలంటూ నేత‌లు చెబుతున్నారంట‌. దీనిపై విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వ పథకాలు, ఇతర అధికార సమాచారం ఎక్కువగా సాక్షి పత్రికలోనే వస్తుంటుంది కాబట్టి ఆ పేపర్ కు లబ్ధి చేకూర్చడానికే అని విమర్శిస్తున్నారు. ఆ పేప‌ర్‌కు ప్ర‌భుత్వం నుంచి నిధుల‌ను నేరుగా ఇస్తే బాగోద‌ని.. ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారంటూ ప్ర‌తిప‌క్షాలు భ‌గ్గుమంటున్నాయి. ఏదేమైనా ఇప్పుడు జ‌గ‌న్ స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యం సంచ‌ల‌నంగా మారిపోయింది.