‘అగ్నిపథ్’ పథకాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో శుక్రవారం ఆందోళన చేపట్టిన నిరసనకారులపై రైల్వే పోలీసులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో బుల్లెట్ తగలి దామోదరం రాకేష్ అనే యువకుడు చనిపోయాడు. ఈ వార్తతో అతడి కుటుంబంలో విషాదం నెలకొంది.
వరంగల్ జిల్లా దబ్బీర్ పేట గ్రామానికి చెందిన రాకేష్.. ఆర్మీ జవాన్ కావాలని కలలు కన్నాడు.
నర్సంపేటలో డిగ్రీ పూర్తి చేశాడు. ఆర్మీ రిక్రూట్మెంట్లో నిబంధనలు మార్చడంతో.. ఈరోజు సికింద్రాబాద్ స్టేషన్లో ఆందోళనల్లో పాల్గొన్నాడు. దురదృష్టవశాత్తు అక్కడ పోలీసుల కాల్పుల్లో చనిపోయాడు. రాకేశ్ సోదరి సంగీత అర్మీ జవాన్గానే పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆమె బీఎస్ఎప్ జవానుగా పశ్చిమ బెంగాల్ లో డ్యూటీ చేస్తున్నారు. అక్క ప్రోత్సాహంతోనే ఆర్మీలో చేరాలని కఠోర సాధన చేశాడు రాకేశ్. కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ పథకానికి నిరసన చేపడదామని హైదరాబాద్ కు మూడు రోజుల క్రితం వచ్చినట్లు తెలుస్తోంది. కానీ అనుకోకుండా ఈ రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు అతడి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీస్ ఫార్మాలిటీస్ పూర్తి అయిన తర్వాత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తామని గాంధీ ఆస్పత్రి డాక్టర్లు తెలిపారు.