గ్రామంలో ‘బ్యాంకు వారి పాట’.. అవమానంతో వలస వెళ్లిన రైతు - MicTv.in - Telugu News
mictv telugu

గ్రామంలో ‘బ్యాంకు వారి పాట’.. అవమానంతో వలస వెళ్లిన రైతు

June 18, 2022

సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన తాజా చిత్రం సర్కారు వారి పాటలో బ్యాంకు వారు అప్పు చెల్లించని మహేశ్ బాబు తండ్రి ఆస్తి వేలం వేస్తామని ప్రకటిస్తారు. దీంతో మనస్థాపానికి గురై మహేశ్ తల్లిదండ్రులు ఉరేసుకొని చనిపోతారు. ఇదే సీన్ తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా ఆంధోల్‌లో రిపీటైంది. కాకపోతే ఇక్కడ రైతు ఆత్మహత్య చేసుకోలేదు. అవమాన భారంతో భార్యాపిల్లలకు నచ్చజెప్పి ఉపాధి కోసం పట్టణానికి వలస వెళ్లాడు. వివరాలు.. మండల పరిధిలోని కంసాన్ పల్లికి చెందిన ఆశిరెడ్డిగారి శంకర్ రెడ్డి అనే రైతుకు 3.31 ఎకరాల పొలం ఉంది. పొలంలో బోరు వేయడం, పైపులైన్ ఏర్పాటు కోసం 2016లో జోగిపేట కోఆపరేటివ్ బ్యాంకులో రూ. 80 వేలు అప్పు చేశాడు. అయితే దిగుబడులు రాకపోవడం, కౌలుకు పొలం తీసుకుని వ్యవసాయం చేసినా నష్టపోవడంతో అప్పు చేసి రూ. 40 వేలు కట్టాడు. తర్వాత ట్రాక్టర్ కూడా అమ్మేశాడు. ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని భావించినా నిరాశ తప్పలేదు. అటు అప్పేమో రూ. 1.42 లక్షలకు చేరింది. దీంతో బ్యాంకు వారు పదే పదే అప్పు గురించి ఒత్తిడి తేస్తూ.. చివరికి భూమిని వేలం వేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఊరంతా పోస్టర్లు అంటించారు. దీంతో అవమానానికి గురైన శంకర్ రెడ్డి పటాన్ చెరువుకు బతుకుతెరువు కోసం వలస వెళ్లిపోయాడు. ఈ విషయంపై బ్యాంకు వారు స్పందిస్తూ.. ‘రూ. 1.42 లక్షలలో 70, 80 శాతం చెల్లించినా కొంత కాలం ఆగేవాళ్లం. కానీ, అది కూడా కుదరకపోవడంతో ఈ నెల 23న భూమిని వేలం వేయాలని నిర్ణయించాం. నిబంధనల ప్రకారమే చర్య తీసుకుంటున్నా’మని తెలిపారు.