The bat that won Pakistan..the player who bid
mictv telugu

పాక్​ను గెలిపించిన బ్యాట్‌..​వేలం పెట్టిన ఆటగాడు

September 10, 2022

ఆసియా కప్‌ 2022 మ్యాచ్‌లు ప్రారంభమైన రోజు నుంచి గతరాత్రి వరకు నువ్వా, నేనా అన్నట్లుగా ఉత్కంఠభరితంగా జరిగాయి. ఆయా జట్లలోని యువ ఆటగాళ్లు రెచ్చిపోయి, సిక్సర్ల మీద సిక్సర్లను కొట్టేస్తున్నారు. తాజాగా ఆసియా కప్ సూపర్-4లో భాగంగా ఆఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో 19 ఓవర్ వరకు అందరూ ఆఫ్ఘానిస్తాన్ జట్టే గెలుస్తుందని ధృడంగా నమ్మారు. కానీ, పాకిస్తాన్ యువ ఆటగాడు, బౌలర్ నసీమ్ షా క్రీజులోకి వచ్చి ఎవరు ఊహించని విధంగా వెంట వెంటనే రెండు సిక్సర్లు కొట్టి, పాకిస్తాన్‌ జట్టును గెలిపించాడు. దాంతో అతడు రాత్రికి రాత్రే స్టారైపోయాడు.

అయితే, పాక్ పేసర్ నసీమ్ షాకు సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది. ఆఫ్ఘానిస్తాన్‌పై పాకిస్తాన్‌ను గెలిపించిన తన బ్యాట్‌ను వేలానికి పెట్టాడు. ఆ బ్యాట్‌ను నసీమ్‌కు అతని సహచరుడు మహ్మద్ హస్నైన్ బహుమతిగా ఇచ్చాడట. ఆ బ్యాట్‌ను నసీమ్ వేలం వేసి, ఆ వేలం ద్వారా వచ్చిన మొత్తంలో సగాన్ని పాకిస్తాన్‌లోని వరద బాధితులకు సాయం చేస్తానని తెలిపాడు. వేలానికి సంబంధించిన వీడియోను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీసీ) ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో వేలానికి సంబంధించి, ఆ బ్యాట్ వివరాలను నసీమ్ షా తెలియజేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.

మరోపక్క గత నెల రోజుల నుంచి పాకిస్తాన్‌లోని పలు ప్రాంతాలు వరదలను గురౌతున్నాయి. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ తాజా నివేదిక ప్రకారం.. ‘వరదల కారణంగా దాదాపు 1,400 మంది మరణించారు’ అని తెలియజేసింది. ఈ క్రమంలో ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం రాత్రి జరిగే ఫైనల్లో శ్రీలంకతో పాకిస్థాన్ తలపడనుంది.