నువ్వుల నూనెతో నూరు లాభాలు.. ఎలా అంటే..! - MicTv.in - Telugu News
mictv telugu

నువ్వుల నూనెతో నూరు లాభాలు.. ఎలా అంటే..!

January 3, 2020

Sesame Oil.

కూర అనగానే మనకు అందులో పోపుకు ఏ నూనె వేశారు అనే ప్రశ్న వేస్తారు. పల్లీల నూనె అని, సన్ ఫ్లవర్ నూనె పేర్లు ఎక్కువగా చెబుతుంటారు. చాలా కొద్ది మంది మాత్రమే నువ్వుల నూనె అంటారు.  ఆ నూనెను మనం ఎక్కువగా ఊరగాయలకు పరిమితం చేశాం. దేవాలయాలలో, ముఖ్యంగా శనేశ్వర ఆలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యడం ఆచారంగా మారింది. దీనిని కేవలం వంటలలోనే కాకుండా దేహమర్దన తైలంగా, ఆయుర్వేద మందులలో, కాస్మోటిక్స్‌ తయారీలో వాడుతారు. రుచిలో, వాసనలో ప్రత్యేకతను చాటుకున్న ఈ నూనె నువ్వుల నుంచి తయారు అవుతుంది. ఈ నువ్వులు మూడు రాకాలుగా పండిస్తారు. నల్లని, తెల్లని, కపిలవర్ణం (ఎరుపు)లో లభిస్తాయి. 

ప్రపంచవ్యాప్తంగా నువ్వులను 65 దేశాలు పండిస్తున్నాయి. నువ్వుల నూనె శక్తివంతమైన అంటీ ఆక్సిడెంట్ గుణం కలిగి ఉన్నదని పరిశోధనల్లో వెల్లడైంది. ఈ నూనెలో కాల్షియం, మినరల్స్, ఐరన్, జింక్, థయామిన్, విటమిన్ ‘ఇ’, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన పిండి పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. మన పూర్వీకులు ఈ నూనెను ఆరోగ్యానికి ఎంతో శ్రేష్టమైనదిగా గుర్తించారు. మరి ఈ నూనెతో మనకు ఎన్ని లాభాలు ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. 

నువ్వుల నూనెతో లాభాలు.. 

-ఈ నూనె కేశాలకు ఎంతో మంచిది. కేశాలు రాలిపోకుండా ఒత్తుగా పెరిగేలా సహకరిస్తుంది. కుదళ్లకు పోషణ అందించడం, వాటి ఆరోగ్యానికి కావాల్సిన విటమిన్ బి, సితోపాటు మెగ్నీషియం, కాల్షియం, దీనిలో ఉండే ప్రొటీన్లు జుట్టు కుదుళ్లను బలంగా ఉండేలా చేస్తాయి. చుండ్రును కూడా నివారిస్తుంది. 

 

-రోజూ క్రమం తప్పకుండా ఈ నూనెను తలకు పట్టిస్తే తెల్లజుట్టును తగ్గిస్తుంది. పేను కొరుకుడు సమస్యకు కూడా ఈ నూనె చక్కని పరిష్కారం చూపిస్తుంది. 

 

-చర్మ సంరక్షణలో నువ్వుల నేనె బాగా పనిచేస్తుంది. ఇందులో ఉండే ఇ, బి విటమిన్లు చర్మానికి సంబంధించిన అన్నీ రకాల సమస్యలను దూరం చేస్తాయి. 

-చిన్నారుల ఆరోగ్యానికి నువ్వుల నూనె బాగా ఉపకరిస్తుంది. దీనిలోని విటమిన్స్, మినరల్స్ చిన్నారుల దేహాన్ని పుష్టిగా ఉంచుతాయి. వారికి ఈ నూనెతో మర్దన చేస్తే చాలా హుషారుగా ఉంటారు. ఇప్పుడు చాలామంది తల్లులు తమ బిడ్డల మర్థనకు ఈ నూనెను వాడుతున్నారు. స్నానానికి ముందు పసిపిల్లల మాడుకు, శరీరానికి ఈ నూనెను మర్థన చేస్తే హాయిగా నిద్రపోతారు. వారిలో మెదడు ఎదుగుదలకు, వెన్నుముక, కండరాలు బలపడేందుకు ఈ నూనె చక్కగా పనిచేస్తుంది. నిత్యం స్నానానికి ముందు, పడుకునేందుకు ముందు నువ్వుల నూనెతో ఒళ్లంతా మసాజ్ చేస్తే చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది. మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది.

 

-బీపీని కంట్రోల్ చేస్తుంది. ఎక్కువ, తక్కువ ఉంటే సమస్థాయికి తీసుకువస్తుంది. వయసు పైబడినవారు ఈ నూనెతో చేసిన పదార్థాలు తింటే మంచి ఆరోగ్యంతో ఉంటారు. 

 

-నువ్వుల్లో కాపర్ మూలకాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉండటంతో కీళ్ల నొప్పులను, వాపులను తగ్గిస్తుంది. దీనిలోని మెగ్నీషియం శ్వాసకోశ సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. అలాగే ఇందులోని కాల్షియం మైగ్రేన్ వంటి సమస్యలను అరికడుతుంది. క్యాన్సర్‌తోనూ పోరాడుతుంది. ఎముకలు గట్టిపడేందుకు ఇందులోని జింక్ ఉపకరిస్తుంది.

-మధుమేహ వ్యాధిగ్రస్తులలో ప్లాస్మాలోని గ్లూకోజ్ స్థాయిలను, రక్తంలో యాంటీ ఆక్సిడెంట్ స్థాయిలను పెంచుతుంది. 

 

-ఇందులోని ఎలిమెంట్స్ సీసమోలో అనే యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు గుండె సంబంధిత వ్యాధులను అరికట్టడంలో సాయపడతాయి.

 

-నువ్వులు దంత క్షయాన్ని అరికడతాయి. దంత సమస్యలు, చిగుళ్ల సమస్యలను, చిగుళ్ల నుంచి రక్తం కారుట, థ్రోట్ ఇన్షెక్షన్‌ను తొలగించి దంతాలకు బలాన్ని చేకూరుస్తుంది. నువ్వుల నూనెతో ఆయిల్ పుల్లింగ్ కూడా చేయొచ్చు.

 

-సాధారణ జలుబును తగ్గిస్తుంది. జలుబు ఎక్కువగా ఉన్నప్పుడు నువ్వుల నూనె వాసన చూస్తే జలుబు తగ్గి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పోతుంది.