The big danger missed by the Indian cricketer..when the ball hit
mictv telugu

భారత క్రికెటర్‌‌కు తప్పిన పెను ప్రమాదం..బంతి తాకడంతో

September 17, 2022

టీమిండియా యువ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్‌ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కోయంబత్తూర్ వేదికగా వెస్ట్ జోన్-సెంట్రల్ జోన్ సెమీ ఫైనల్‌లో జరిగిన మ్యాచ్‌ సందర్భగా వెంకటేశ్ అయ్యర్ బ్యాటింగ్ చేస్తుండగా, వెస్ట్ జోన్ బౌలర్ చింతన్ గజా గట్టిగా బంతిని విసిరాడు. దాంతో ఆ బంతి వేగంగా వచ్చి వెంకటేశ్ అయ్యర్ మెడకు గట్టిగా తాకడంతో బాధను తట్టుకోలేక, మైదానంలోనే కుప్పకూలాడు. వెంటనే అప్రమత్తమైన ఫిజియో పరుగున వచ్చి, అయ్యర్‌ను పరీక్షించి, రక్షించాడు.

వివరాల్లోకి వెళ్తే..ప్రస్తుతం దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు వెంకటేశ్ ఆడుతున్న విషయం తెలిసిందే. శుక్రవారం కోయంబత్తూర్ వేదికగా వెస్ట్ జోన్-సెంట్రల్ జోన్ సెమీ ఫైనల్ మ్యాచ్ రెండో రోజు ఆట జరిగింది. ఈ మ్యాచ్‌లో వెంకటేశ్ అయ్యర్ బ్యాటింగ్ చేస్తుండగా, వెస్ట్ జోన్ బౌలర్ చింతన్ గజా బంతిని సంధించడంతో ఈ ఘటన జరిగింది. అయితే, ఈ ఘటన జరగడానికి ఓ ప్రధాన కారణం ఉంది..అంతకుముందు బంతిని అయ్యార్ సిక్స్‌గా మలచడంతో, గజా తెగ ఫ్రస్టేషన్‌లోకి వెళ్లాడు. దాంతో వెంటనే బంతిని వెంకటేశ్ మీదకు విసిరాడు. అది నేరుగా వెంకటేశ్ అయ్యర్ మెడకు తాకడంతో బాధతో మైదానంలోనే విలవిలాడిపోయాడు.

దెబ్బ తగిలిన కాసేపటికే తేరుకొన్న వెంకటేశ్..డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లాడు. ఆ తర్వాత నొప్పిని భరిస్తూనే కష్టాల్లో ఉన్న తన జట్టు సెంట్రల్ జోన్ కోసం వెంకటేశ్ అయ్యర్ బ్యాటింగ్‌కు వచ్చాడు. కానీ, 14 పరుగులకే ఔటై వెనుతిరిగాడు. అందులో రెండు ఫోర్లు, సిక్స్ ఉండటం గమనార్హం. సెమీలో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్ట్ జోన్ 257 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి (67), పృథ్వీషా (60) అర్ధశతకాలు సాధించారు. సెంట్రల్ జోన్ కేవలం 128 పరుగులకే మొదటి ఇన్నింగ్స్ లో కుప్పకూలింది. కెప్టెన్ కరణ్ శర్మ (34) టాప్ స్కోరర్. అనంతరం రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన వెస్ట్ జోన్ 130/3 స్కోరుతో కొనసాగుతోంది. పృధ్వీ షా (104*) సెంచరీ బాదేశాడు. ప్రస్తుతం వెస్ట్ జోన్ మొత్తం 259 పరుగుల ఆధిక్యంతో కొనసాగుతోంది.