The bihar police dragged the dead body with ropes
mictv telugu

శవానికి తాళ్లుకట్టి ఈడ్చుకుంటూ లాక్కెళ్లిన పోలీసులు.. ఎస్సై సస్పెండ్

July 30, 2022

బీహార్‌లో పోలీసుల అమానుష చర్య వెలుగులోకి వచ్చింది. మ‌ృతదేహానికి రెండు వైపులా తాళ్లు కట్టి ఈడ్చుకుంటూ తీసుకెళ్లి ట్రాక్టర్‌లోకి ఎక్కించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు పోలీసులను విమర్శిస్తూ షేర్ చేస్తున్నారు. పూర్తి కథనం ప్రకారం.. బెగుసరాయ్ నగరంలోని లాఖో పోలీస్ స్టేషన్ పరిధిలో సిమెంట్ ఫ్యాక్టరీ రోడ్డు పక్కన ఓ గుర్తు తెలియని శవం ఉంది. దానిని కుక్కలు పీక్కు తింటుండడంతో గమనించిన స్థానికులు విషయాన్ని పోలీసులకు చేరవేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించే క్రమంలో శవాన్ని లాగడానికి ఇద్దరు వ్యక్తుల సాయం తీసుకున్నారు. వారు శవానికి తాడు కట్టి ట్రాక్టర్ వరకు ఈడ్చుకుంటూ లాక్కెళ్లారు. తర్వాత ట్రాక్టర్‌లోకి ఎక్కించి ఆస్పత్రికి చేరాక స్ట్రెచర్‌పై పోస్టుమార్టం గదిలోకి తీసుకెళ్లారు. అయితే ఈడ్చుకుంటూ తీసుకెళ్తున్న వీడియో బయటికి రావడంతో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మనిషి శవాన్ని జంతువులా లాక్కెళ్లిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ యోగేంద్ర కుమార్‌ను డిమాండ్ చేశారు. దీంతో స్పందించిన యోగేంద్ర.. పోలీసులపై విచారణ జరిపి దోషులని తేలితే కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. కాగా, ఇప్పటికే స్టేషన్ ఎస్సైని సస్పెండ్ చేసి స్టేషన్ హౌస్ ఆఫీసరుకి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయితే మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు.