‘బీజేపీ నాకు ఉప ప్రధాని పదవి ఇస్తానంది’ - MicTv.in - Telugu News
mictv telugu

‘బీజేపీ నాకు ఉప ప్రధాని పదవి ఇస్తానంది’

April 23, 2022

క్రైస్తవ మత గురువు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ శనివారం హైదరాబాదులో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర అంశాలను మీడియాతో పంచుకున్నారు. ఆయన మాటల్లోనే.. ‘అభివృద్ధి కోసం నేను అప్పట్లో తెలంగాణకు మద్దతిచ్చా. కానీ, ఇప్పుడు చూస్తే రాష్ట్రం పూర్తిగా అప్పులపాలైంది. ఏపీలో కూడా ఇదే పరిస్థితి. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితిలో లేవు. పాలన గాడి తప్పి లక్షల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. కేటీఆర్ బీజేపీని తిడుతూ టీఆర్ఎస్ తప్పులను కప్పి పుచ్చుతున్నారు. సొంత మీడియా సంస్థలు పెట్టుకొని డబ్బా కొట్టుకుంటున్నారు.

బీజేపీ నాకు రాజ్యసభ ఎంపీని చేసి దేశ ఉప ప్రధానిని చేస్తానని ముందుకొచ్చింది. కానీ, నేను దానిని తిరస్కరించాను. నా ప్రతిభ గురించి తెలుసు కాబట్టే మోదీ, జగన్, కేసీఆర్ నేనంటే భయపడతారు. ఇప్పటికే లక్షల కోట్లు ఛారిటీల ద్వారా రెండు రాష్ట్రాల్లో పంచాను. ప్రపంచంలో నాలాంటి వ్యక్తి ఎవ్వరూ ఉండరు. ప్రజలు ఇప్పుడున్న పార్టీలకు ఓటు వేయవద్దు. తెలంగాణలో గ్రామగ్రామాన పర్యటిస్తా. కేటీఆర్ ఇకనైనా నన్ను ప్రత్యర్ధిగా గుర్తించాలి. వచ్చే ఎన్నికల్లోపు దేశవ్యాప్తంగా పర్యటించి అందరినీ కలుపుకొని వెళ్తా. ఇప్పటికే 18 పార్టీల నాయకులను కలిపా. అసెంబ్లీ, పార్లమెంటులో ప్రజా సమస్యలపై చర్చలు మాని ఒకరినొకరు తిట్టుకోవడంతో రాజకీయ నాయకులు సరిపెడుతున్నారు.