జగన్‌గణమన వైసీపీ జయహే.. జాతీయ జెండాకు పార్టీ రంగు - MicTv.in - Telugu News
mictv telugu

జగన్‌గణమన వైసీపీ జయహే.. జాతీయ జెండాకు పార్టీ రంగు

October 29, 2019

పార్టీలు మారితే ప్రభుత్వ పథకాల పేర్లు మారిపోతాయి. మరీ పంతానికి పోతే ఆ పథకాలే నామరూపాల్లేకుండా పోతాయి. అంతేగానీ జాతీయ జెండా జోలికి బుద్ధి ఉన్న ఎవరైనా పోతారా? పోరు కదూ. అసలు జాతీయ జెండాని మార్చిన ఆ ఘన పార్టీ ఏదబ్బా అని మీలో మీరు ప్రశ్నలు వేసుకుంటున్నారు కదూ. జాతీయ జెండా రూపును మార్చాలనుకున్న ఆ ఐడియా వచ్చిన ఆ మోస్ట్ పాపులర్ పార్టీ పేరు వైఎస్సార్‌సీపీ. ఆశ్చర్యపోకండి.. మీరు విన్నది నిజమే. ఎవరో కార్యకర్తలు చేసిన ఘనకార్యానికి పార్టీకి తలవంపులు వచ్చే పరిస్థితి ఎదురైంది. కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఎలా ఉంటుందో ఈ ఘటన నిరూపిస్తోంది.  

జాతీయ జెండాను చెరిపేసి వైసీపీకి సంబంధించిన నీలం రంగు వేస్తున్నారు. అనంతపురం జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అనంతపురం జిల్లా అమరాపురం మండలం తమ్మడపల్లి గ్రామంలో పంచాయతీ భవనానికి ఉన్న జాతీయ జెండా రంగును తొలగించి.. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గుర్తులను పెయింటింగ్ చేస్తున్నారు. ఈ ఘటనపై గ్రామస్తులు, దేశభక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తలారా.. పార్టీ మీద ప్రేమ పొంగిపోతే ఆ జెండాని నెత్తిన పెట్టుకుని ఊరేగండి కానీ, ఇలా జాతీయ జెండాను అవమానించకండి అంటూ కొందరు సుతిమెత్తగా వారిస్తున్నారు. 

అనంతపురం జిల్లా అమరాపురం మండలం తమ్మాడేపల్లి గ్రామం ????

Posted by Chai Samosa on Tuesday, 29 October 2019

మరికొందరేమో వైసీపీకి జాతీయజెండా కంటే పార్టీ రంగులే ముఖ్యమయ్యాయా అని ప్రశ్నిస్తున్నారు. జాతీయ జెండా కలర్‌తో పంచాయతీ భవనాన్ని నిర్వహిస్తే తప్పేముందని నిలదీస్తున్నారు. జాతీయ జెండా రంగులను చెరిపేసి.. వైసీపీ రంగులు వేసినవారు, వేయించిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇంతకుముందు ఇలాగే స్మశానంలో కూడా వైసీపీ రంగులు వేయడం కలకలం రేపిన విషయం తెలిసిందే.

కాగా, టీడీపీ హయాంలో పంచాయతీ కార్యాలయాలకు టీడీపీని ప్రతిబింబించేలా పసుపు రంగులు వేశారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆ పసుపు రంగులను చెరిపేసి వైసీపీ రంగులు వేస్తున్నారు. పంచాయతీ కార్యాలయాలు, వాటర్ ట్యాంక్‌లు, ప్రభుత్వ కార్యాలయాలకు ఇలా వైసీపీ రంగులు వేయడం మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఏకంగా జాతీయ జెండాను కూడా చెరిపేసి వైసీపీ రంగులు వేయడం విమర్శలకు తావిస్తోంది. జనగణమనను కాస్తా జగన్‌గణమనగా కార్యకర్తలు మార్చినా మార్చేస్తారు అని అంటున్నారు.