ముగిసిన తెప్పోత్సవం.. నదీ విహారం లేకుండానే.. - MicTv.in - Telugu News
mictv telugu

ముగిసిన తెప్పోత్సవం.. నదీ విహారం లేకుండానే..

October 25, 2020

ap

కృష్ణానదిలో నేడు జరగాల్సిన దుర్గమ్మ నదీ విహారానికి బ్రేక్‌ పడ్డ విషయం తెలిసిందే. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం కొనసాగుతుండటంతో నదిలో తెప్పోత్సవానికి ఆటంకం ఏర్పడింది. ఫంట్‌ మీద అమ్మవారికి పూజలు మాత్రమే నిర్వహించాలని కో-ఆర్డినేషన్‌ సమావేశంలో జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌, సీపీ బత్తిన శ్రీనివాసులు, ఇతర అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో నేడు ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. చివరి ఘట్టంగా ప్రతి ఏటా నిర్వహించే కనకదుర్గమ్మ తెప్పోత్సవ సేవ కన్నుల పండువగా జరిగింది. 

దుర్గాఘాట్‌లోని నది ఒడ్డునే హంస వాహనంపై ఉత్సవ మూర్తులను ప్రతిష్ఠించి అర్చకులు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆద్యంతం వైభవంగా సాగింది. మరోపక్క దుర్గా ఘాట్‌లో కృష్ణా నదికి నిర్వహించిన హారతులు, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను  అలరించాయి. ఆ తర్వాత శమీ పూజ నిమిత్తం సంప్రదాయం ప్రకారం ఉత్సవ మూర్తులను పాతబస్తీ ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా, ఈ తెప్పోత్సవం కార్యక్రమంలో విజయవాడ నగర సీపీ బత్తిన శ్రీనివాసులు, దుర్గ గుడి ఛైర్మన్‌ పైలా సోమినాయుడు, ఈవో సురేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.