డిచ్‌పల్లి అడవుల్లో బాంబు పేలి ఆవు మృతి - MicTv.in - Telugu News
mictv telugu

డిచ్‌పల్లి అడవుల్లో బాంబు పేలి ఆవు మృతి

May 15, 2019

వేటగాళ్లు, వన్యప్రాణుల స్మగ్లర్లు పేల్చిన నాటుబాంబుకు ఓ ఆవు బలైంది. మేతకోసం అడవికి వెళ్లిన అరుదైన అలీకర్ జాతికి చెందిన పాడి ఆవు నాటు బాంబును నోట కరవడంతో బాంబు పేలింది. తీవ్ర గాయాలపాలైన ఆవు అక్కడికక్కడే మృత్యువాత పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. డిచ్‌పల్లి మండలం సుద్దపల్లి అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది ఈ దారుణం. చనిపోయిన ఆవు అంకుష్ గోశాల సంరక్షణలో ఉంది. ఈ ఘటనపై అంకుష్‌ గోశాల నిర్వాహకులు డిచ్‌పల్లి పొలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

The bomb exploded in the forests of Dichpalli ... Cow killed

తమ గోశాలలో 27 రకాల జాతులకు చెందిన 500 ఆవుల వున్నాయని.. మేతకు సమీపంలోని అటవీ ప్రాంతాలకు నిత్యం వెళ్తుంటాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలోని అన్ని అటవీ ప్రాంతాల్లో వేటగాళ్లు యథేచ్ఛగా వన్యప్రాణులను వేటాడుతున్నా అటవీ అధికారులు పట్టించుకోవడంలేదని తెలిపారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సుద్దపల్లి అటవీ ప్రాంతంతో పాటు తెలంగాణ యూనివర్సిటీ వేటగాళ్లు మూగజీవాలను అన్యాయంగా చంపుతున్నారని స్థానికులు వాపోతున్నారు. ఆహార పదార్థాలు, పిండి పదార్థాల్లో నాటు బాంబులు చుట్టీ వన్యప్రాణులను వేటాడి చంపుతున్నారని చెప్తున్నారు. పేలుడు పదార్థాలను వినియోగిస్తున్నా పట్టించుకునే నాథుడే లేడని ఆందోళన వ్యక్తంచేశారు. 

ఈ విషయంలో చూసిచూడనట్టుగా వ్యవహరిస్తున్న అటవీ అధికారుల తీరుపై వ్యన్యప్రాణి ప్రేమికులు విమర్శలు గుప్పిస్తున్నారు. వేటగాళ్ల కారణంగా మూగ జీవాలు బలవుతున్నాయని, వారికి రాజకీయ నాయకుల అండదండలు వున్నాయని అంటున్నారు.  వన్యప్రాణుల సంరక్షణకు మహారాష్ట్ర మాదిరి కఠిన చట్టాలను తీసుకురావాలని కోరుతున్నారు.