The Bombay High Court quashed the Shirdi Sai Sansthan Board
mictv telugu

షిర్డీ సాయి సంస్థాన్ బోర్డును రద్దు చేసిన బాంబే హైకోర్టు.. ఎందుకంటే

September 13, 2022

మహారాష్ట్రలోని ప్రముఖ దేవాలయమైన షిర్డీ సాయి బాబా ఆలయ సంస్థాన్ ధర్మకర్తల బోర్డును బాంబే హైకోర్టు రద్దు చేసింది. 8 వారాల్లోగా కొత్త బోర్డు నియామకం చేపట్టాలని, అప్పటివరకు ఆలయ నిర్వహణను మునుపటిలా ముగ్గురు సభ్యుల కమిటీకి అప్పగించాలని ఆదేశించింది. అంతకుముందు మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చట్ట విరుద్ధంగా బోర్డు సభ్యుల నియామకం చేపట్టారని సామాజిక కార్యకర్త సంజయ్ కాలే ఔరంగాబాద్ హైకోర్టు బెంచీలో పిటిషన్ దాఖలు చేశారు. నిబంధనల ప్రకారం ధర్మకర్తల మండలిని నియమించలేదని, ప్రమాణాలు పాటించలేదని అందులో పేర్కొన్నారు. దీనిని విచారించిన కోర్టు తీర్పు రిజర్వ్‌లో ఉంచి, తాజాగా తీర్పు వెలువరించింది. కాగా, మూడు పార్టీల కూటమి ప్రభుత్వం అయిన మహా వికాస్ అఘాడీ హయాంలో మొదట ఎన్‌సీపీ ఎమ్మెల్యే అశుతోష్ కాలేను బోర్డు అధ్యక్షుడిగా నియమించి మరి కొందరిని సభ్యులుగా చేశారు. ఆ తర్వాత కోర్టు ఆదేశాల మేరకు మరికొంతమందిని సభ్యులుగా నియమించారు. కానీ, నియామకాల్లో ప్రభుత్వం చట్ట ప్రకారం వ్యవహరించలేదని, రాజకీయ కారణాలతో మూడు పార్టీలు పదవులను పంచుకున్నాయని ఆరోపిస్తూ పిటిషన్ దాఖలైంది. దీంతో కోర్టు తాజా తీర్పును వెలువరించింది.