మహారాష్ట్ర – కర్ణాటక రాష్ట్రాల మధ్య ఏళ్లుగా పరిష్కారం కాని సరిహద్దు వివాదం మళ్లీ రాజుకుంది. కర్ణాటకలోని సరిహద్దు ప్రాంతం బెళగావిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర నెంబర్ ప్లేట్లు ఉన్న వాహనాలను కన్నడిగులు టార్గెట్ చేశారు. ముంబై నుంచి పుణె వెళ్తున్న ఓ లారీ అద్దాలను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళనకారులను చెదరగొడుతుండగా, పరిస్థితిని అదుపులో తెచ్చేందుకు 21 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు.
కర్ణాటక రక్షక్ వేదికకు చెందిన 400 మందిని అరెస్ట్ చేశారు. సరిహద్దు వివాదం నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు మంత్రులను కోఆర్డినేటర్లుగా నియమించింది. వారు మంగళవారం పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఈ ఆందోళన చెలరేగింది. అటు పర్యటనకు రావద్దని కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై తేల్చి చెప్పడంతో మహారాష్ట్ర మంత్రులు పర్యటన రద్దు చేసుకున్నారు. అయినా నిరసనలు రాజుకోవడంతో పోలీసులను భారీగా మొహరించారు. కాగా, ఫజల్ అలీ కమిషన్ రిపోర్టు ప్రకారం అప్పటి బొంబాయి రాష్ట్రం నుంచి నాలుగు జిల్లాలను అప్పటి మైసూరు రాష్ట్రంలో కలిపారు. అప్పటి నుంచి ఈ వివాదం నడుస్తూనే ఉంది. మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లగా అక్కడ విచారణ కొనసాగుతోంది.