The boy complained to the police that his mother did not feed him
mictv telugu

అమ్మపై పోలీసులకు ఫిర్యాదు చేసిన 8 ఏళ్ల బాలుడు.. వీడియో

September 14, 2022

ఎనిమిదేళ్ల చిన్నారి అంటే అమ్మ అన్నం పెడుతున్నా తిననని మారాం చేస్తూ సతాయిస్తుంటాడు. కానీ బీహార్‌లో మాత్రం ఆ వయసున్న బాలుడు ఏకంగా పోలీసులకే ఫిర్యాదు చేశాడు. తనకు అమ్మ అన్నం పెట్టట్లేదని, అన్నం అడిగితే కొడుతుందని చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతని మీద జాలేసి ముందుగా కడుపునిండా భోజనం పెట్టిన పోలీసులు ఆ తర్వాత అతని వివరాలు కనుక్కున్నారు. వివరాల్లోకెళితే.. సీతామఢీ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ఎనిమిదేళ్ల బాలుడు శివమ్.. పోలీస్ స్టేషనుకి వెళ్లాడు. చిన్న పిల్లాడు ఒంటరిగా స్టేషనుకి రావడంతో మొదట అవాక్కయిన పోలీసులు అతడిని సముదాయించి ఎందుకు వచ్చావని అడిగితే.. ఇంట్లో అన్నం అడిగితే అమ్మ కొడుతుందని, సమయానికి భోజనం పెట్టట్లేదని కన్నీళ్లు పెట్టుకున్నాడు. దాంతో ముందుగా భోజనం పెట్టిన పోలీసులు అతడిని ఇంటికి తీసుకెళ్లారు. తల్లిని ప్రశ్నించగా, అదేం లేదు సార్.. అల్లరి చేస్తుంటే ఒక్కోసారి తిడుతుంటానని చెప్పింది. పిల్లాడి తండ్రి ఉద్యోగ రీత్యా వేరే గ్రామంలో ఉంటాడని తెలుసుకున్నారు. తర్వాత తల్లిని మందలించిన పోలీసులు.. శివమ్‌కి నచ్చజెప్పి అక్కడ్నుంచి వెళ్లిపోయారు. కాగా, స్టేషనులో బాలుడి ఫిర్యాదు, ఏడుపును వీడియో తీయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.