The bride was fined Rs 10 lakh for losing her virginity
mictv telugu

కన్యత్వం కోల్పోయిందని..వధువుకు రూ.10 లక్షల జరిమానా

September 6, 2022

దేశవ్యాప్తంగా గతకొన్ని రోజులుగా కొన్ని విచిత్ర సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా క్షుద్రపూజలకు సంబంధించినవి కొన్ని అయితే, మరికొన్ని ఘటనలు..అత్తింటి వేధింపులు, వరకట్న వేధింపుల వంటివి. తాజాగా రాజస్థాన్‌లో ఓ వధువు తన కన్యత్వం కోల్పోయిందని ఏకంగా 10 లక్షల రూపాయల జరిమానాను విధించిన సంఘటన వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌ రాష్ట్రం బిల్వారా జిల్లా బాగోర్‌లో ఈ ఘటన జరిగింది. మే 11న బాగోర్‌కు చెందిన వ్యక్తితో బాధితురాలికి వివాహమైంది. అయితే, ఈ ప్రాంతంలో ఓ దురాచారం అమల్లో ఉంది. పెళ్లైన మరుసటి రోజే.. నూతన వధువుకు కన్యత్వ పరీక్ష నిర్వహిస్తారు. దీన్ని కుకుడి ఆచారమని అంటారు. ఈ ఆచారం ప్రకారం బాధితురాలకి తాజాగా కన్యత్వ పరీక్షను నిర్వహించారు. ఆ పరీక్షలో వధువు విఫలమైంది. అంటే కన్యత్వం కోల్పోయింది. దీంతో ఆమెను అత్తింటివారు చితకబాదారు. ఇంటి నుంచి వెళ్లగొట్టారు. అంతటితో ఆగకుండా, మే 31న గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు.

దాంతో బాధిత మహిళ తనపై జరిగిన ఓ సంఘటనను బయటపెట్టింది. ‘పెళ్లికాకముందు నాపై పొరుగింటి యువకుడు అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై నేను ఆరోజు పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశాను’ అని నిజాయితీగా పెద్దల ముందు మొరపెట్టుకుంది. అయినా, భర్త కుటుంబానికి రూ.10 లక్షల జరిమానా చెల్లించాల్సిందేనని పెద్దలు తీర్పిచ్చారు. దాంతో బాధితురాలు పోలీసు స్టేషన్‌లో భర్త, అత్త, మామ, ఇతరులపై ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.