కొత్త వేరియంట్‌పై కేంద్రం.. మరో టీకాకు ఆదేశం - MicTv.in - Telugu News
mictv telugu

కొత్త వేరియంట్‌పై కేంద్రం.. మరో టీకాకు ఆదేశం

April 8, 2022

fbxfcb

కరోనా కొత్త వేరియంట్ ‘ఎక్స్ఈ’ ప్రవేశిస్తున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లు పైబడిన వారందరికీ ప్రికాషన్ డోసు పేరుతో మరో టీకా ఇవ్వడానికి రంగం సిద్ధం చేసింది. తొలిదశలో ఉన్న కొత్త వేరియంట్ వ్యాపించకుండా ఉండాలంటే మరో డోసు ఇవ్వాల్సిందేనని నిర్ధారణకు వచ్చింది. ఏప్రిల్ 10 వ తేదీ నుంచి దేశంలోని వయోజనులందరికీ ప్రైవేటు కేంద్రాల ద్వారా టీకాలు ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. రెండో డోసు తీసుకొని 9 నెలలు పూర్తయిన వారు ఈ ప్రికాషన్ డోసు తీసుకునేందుకు అర్హులని ప్రకటించింది. ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ప్రస్తుతం జరుగుతున్న తొలి, రెండో డోసు పంపిణీ, ఫ్రంట్ లైన్ వర్కర్లు, వయో వృద్ధులకు ప్రికాషన్ డోసు పంపిణీ కొనసాగుతుందని స్పష్టం చేసింది. కాగా, ఇప్పటివరకు రెండున్నర కోట్ల మంది ఫ్రంట్ వర్కర్లు ప్రికాషన్ డోసు వేసుకున్నారు. 15 ఏళ్లు పైబడిన వారిలో తొలిడోసు 96 శాతం మందికి, 83 శాతం మందికి రెండో డోసు వేసినట్టు ఆ శాఖ అధికారులు తెలిపారు. ఇక, 12 నుంచి 14 ఏళ్ల మధ్యలో ఉన్న వారిలో 45 శాతం మందికి తొలిడోసు ఇచ్చినట్టు వివరించింది.