నిధుల లేమితో సతమతమవుతున్న తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం స్వీట్ న్యూస్ చెప్పింది. తాత్కాలికంగా రూ. 4 వేల కోట్లు అప్పు తెచ్చుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. దీంతో 13 ఏళ్ల కాలపరిమితికి ఆర్బీఐ బాండ్ల వేలానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులు కొంతమేర తగ్గనున్నాయి. వాస్తవానికి ఈ ఆర్దిక సంవత్సరంలోని మొదటి మూడు నెలల్లో తెలంగాణ రూ. 11 వేల కోట్లను అప్పుగా తెచ్చుకోవాలనుకుంది.
అయితే మారిన ఎఫ్బీఆర్ఎం నిబంధనలతో నిధులు తెచ్చుకోవడం కష్టంగా మారింది. తాజా పరిణామంతో తెలంగాణ సర్కారు ఊపిరి పీల్చుకోగా, కేంద్రం ప్రస్తుతానికి తాత్కాలికంగా అనుమతి ఇచ్చినప్పటికీ, ఈ ఏడాది రుణ పరిమితి ఎంత అనే విషయాన్ని వెల్లడించలేదు. ఇదిలా ఉండగా, ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, సాధారణ పరిపాలనా ఖర్చులకు ఇప్పటివరకు వస్తున్న రాబడి సరిపోకపోవడంతో మద్యం ధరలు పెంచిన విషయం తెలిసిందే. ఏది ఏమైనా అప్పు పుట్టడంతో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు బంధు పథకానికి నిధులు సర్దుబాటు చేసే వీలు చిక్కింది.