దేశంలో తొలిసారి మంకీపాక్స్ వ్యాధి కేరళలో వెలుగుచూసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ వ్యాధి వ్యాప్తిని అరికట్టే దిశగా ప్రజలకు పలు సూచనలు చేసింది. ముఖ్యంగా విదేశాలకు వెళ్లే ప్రయాణీకులు అక్కడ అనారోగ్యంతో ఉన్నవారికి దూరంగా ఉండాలని హెచ్చరించింది. దీంతో పాటు జంతు సంబంధిత ఆహార పదార్ధాలకు దూరంగా ఉండాలని సూచించింది. ఈ సందర్భంగా కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి.
1. విదేశాల్లో ఉన్నప్పుడు రోగులు, చర్మసంబంధిత వ్యాధులు, జననేంద్రియాల వ్యాధులున్న వారికి దూరంగా ఉండాలి.
2. చనిపోయిన లేదా బతికున్న ఎలుకలు, కోతులు, ఉడతలు, చింపాంజీలను నేరుగా తాకరాదు
3. ఆఫ్రికా జంతువులతో తయారు చేసిన మాంసం, ఇతర ఉత్పత్తులను తినవద్దు
4. రోగులు వాడిన పడక, దుస్తులు, ఇతర వస్తువులను వాడవద్దు
కాగా, మంకీపాక్స్ నిర్ధారణ అయిన వ్యక్తితో సన్నిహితంగా ఉన్న 13 మందిని ప్రైమరీ కాంటాక్ట్స్గా కేంద్రం గుర్తించింది. అలాగే ఈ వ్యాధిని నిర్ధారించేందుకు 15 డయాగ్నోస్టిక్ లాబోరేటరీలను సిద్ధంగా ఉంచింది. ఇప్పటివరకు ప్రపంచంలోని 50 దేశాల్లో ఈ వ్యాధి గుర్తించగా, ఒక్క మరణం చోటుచేసుకుంది.