తెలంగాణ, కేంద్రం మధ్య ఇప్పటికే జరుగుతున్న రచ్చలో మరో అంశం చేరింది. ఉపాధి హామీ పథకం కింద ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర పథకాలకు వాడుకోవడం పట్ల కేంద్రం సీరియస్ అయ్యింది. దారి మళ్లించిన రూ. 152 కోట్లను నవంబర్ 30 లోగా తిరిగి చెల్లించాలని, లేదంటే చట్టపరంగా తదుపరి వాయిదాల చెల్లింపులను నిలిపివేస్తామని నోటీసులు పంపించింది.
ఇందుకు సంబంధించి కేంద్ర బృందం జూన్ 9 నుంచి 12 మధ్య తెలంగాణలో పర్యటించి అవకతవకలను నిర్ధారించి కేంద్రానికి నివేదిక పంపింది. చేపలు ఎండబెట్టే ప్లాట్ ఫాంలు, అడవుల్లో గుంతల తవ్వకం వంటి అనుమతి లేని పనులకు ఉపాధి హామీ నిధులను ఖర్చు చేసినట్టు గుర్తించింది. దీంతో సెక్షన్ 27 ప్రకారం చర్యలు తీసుకుంటామని కేంద్రం నోటీసులో పేర్కొంది. కాగా, ఇప్పటికే పలు అంశాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నోటీసులు రావడం చర్చనీయాంశంగా మారింది.