ప్రతీ ఏడాది తెలంగాణ రాష్ట్ర అప్పుల భారం పెరుగుతోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2018 మార్చి నుంచి 2022 మార్చి వరకు అంటే గడిచిన నాలుగేండ్లలో ఆ అప్పులు డబుల్ అయ్యాయని లోక్‌సభలో ప్రకటించింది. ఐదేళ్లలో రాష్ట్ర అప్పులు 94.75 శాతం పెరిగినట్లు కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ వివరించింది. 2018లో రూ.లక్షా 60వేల 296.3 కోట్ల వరకు ఉన్న అప్పులు.. 2022 నాటికి రూ.3 లక్షల 12 వేల 191.3 కోట్లకు చేరినట్లు తెలిపింది. లోక్‌సభలో బీఆర్ఎస్ ఎంపీలు వెంకటేశ్, రంజిత్‌రెడ్డి, కవిత అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్ధికశాఖ లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. 2018 మార్చి నాటికి రూ. 1,60,296.3 కోట్లుగా ఉన్న తెలంగాణ అప్పు, ఈ యేడాది మార్చి నాటికి రూ. 3,12,191.3 కోట్లకు చేరిందని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.
రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో గత మూడేళ్లుగా అప్పుల శాతం పెరుగుతూ పోతోందని కేంద్రం తెలిపింది. 2016లో రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో అప్పుల శాతం 15.7 ఉండగా.. ఆ తర్వాత భారీగా పెరుగుదల ఉన్నట్లు ఆర్ధికశాఖ లెక్కల్లో వెల్లడైంది. 2022 నాటికి రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో 27.4 శాతం అప్పులు నమోదైనట్లు వివరించింది.
2018 మార్చి నుంచి 2019 మార్చి నాటికి తెలంగాణ సర్కార్ రూ. 29,906.4 కోట్ల అప్పు చేసింది. 2019–2020 మధ్య రూ. 35, 215.3 కోట్లు అప్పులు చేసింది. 2020–21 లో రూ. 42, 112.7 కోట్లు, 2021–2022లో ఏకంగా రూ. 44,660.6 కోట్లు అప్పులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. అంటే గడిచిన రెండేండ్లలోనే రాష్ట్ర ప్రభుత్వం చేసిన కొత్త అప్పులు దాదాపు రూ. 87 వేల కోట్లని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2021–2022 నాటికి 16.7 శాతంతో అప్పుల పెరుగుదలలో తెలంగాణ ఆరో స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 10.7 శాతంతో 15 ప్లేస్ లో ఉన్నట్లు రిపోర్ట్‌లోని అంకెలు చెప్తున్నాయి. మధ్య ప్రదేశ్ 19 శాతంతో ఫస్ట్ ప్లేస్ లో ఉండగా… 18.8 శాతంతో హర్యానా సెకండ్ ప్లేస్, 18.7 శాతంతో అస్సాం థర్డ్ ప్లేస్ లో ఉన్నాయి. 18 శాతంతో తమిళనాడు, సిక్కిం నాలుగో స్థానంలో ఉన్నాయి. జీరో పాయిట్ వన్ శాతం (16.8 శాతం) తో రాజస్థాన్ తెలంగాణ కన్నా ముందుంది. రాష్ట్రాల అప్పుల పెరుగుదల శాతంలో కేవలం 6.4 శాతంతో గుజరాత్ చివరి స్థానంలో ఉంది.