తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చేంత అర్హత లేదని తేల్చి చెప్పింది. గురువారం లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్ శక్తి శాఖ తరపున మంత్రి బిశ్వేశ్వర్ టుడు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. అందులో ‘తెలంగాణ సీఎం కేసీఆర్ 2016, 2018లలో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ప్రధాని మోదీని కోరారు. పరిశీలిస్తే ఈ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు తీసుకోలేదని వెల్లడైంది. ఒకవేళ అనుమతులుంటే కాళేశ్వరాన్ని హైపవర్ స్టీరింగ్ కమిటీ పరిశీలించాలి. ఆ కమిటీ అనుమతిస్తే జాతీయ హోదా వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాక, ఈ ప్రాజెక్టుకు పెట్టుబడుల అనుమతులు కూడా లేవు’ అని స్పష్టం చేసింది. కాగా, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చిన్న ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇస్తున్న కేంద్రం.. తెలంగాణలోని కాళేశ్వరానికి మాత్రం హోదా ఇవ్వట్లేదని టీఆర్ఎస్ మంత్రులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఇచ్చిన తాజా సమాచారం ప్రాధాన్యం సంతరించుకుంది.