సంచలనం.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించనున్న కేంద్రం - MicTv.in - Telugu News
mictv telugu

సంచలనం.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించనున్న కేంద్రం

June 1, 2022

తెలంగాణ రాష్ట్రంలో పాగా వేయాలని తీవ్రంగా శ్రమిస్తున్న బీజేపీ పార్టీ అందుకనుగుణంగా పావులు కదుపుతోంది. రానున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని దృష్టిలో పెట్టుకొని ఓ సంచలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కేంద్రంలో ఆ పార్టీయే అధికారంలో ఉన్నందున గురువారం జరుగబోయే ఆవిర్భావ వేడుకలను కేంద్ర ప్రభుత్వం తరపున నిర్వహించేందుకు నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందుకు ముఖ్య అతిథిగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. ఇప్పటికే తెలంగాణకు చెందిన పలువురు కళాకారులు ఢిల్లీకి చేరుకున్నారు. కాగా, ఇందులో సంచలనమేంటంటే.. కేంద్రం తొలిసారి ఓ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరపడం. ఇంతవరకు ఏ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నా కూడా ఇలా ఒక రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపలేదు. దీంతో ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది. ఇలా చేయడం తెలంగాణకే పరిమితం అవుతుందా? లేక ఇతర రాష్ట్రాల విషయాలలో కూడా ఇలా భవిష్యత్తులో చేస్తారా? అనే చర్చ మొదలైంది. దీనితో టీఆర్ఎస్, బీజేపీల మధ్య అధికార పోరు ఎక్కువవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదికాక, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాదులో నిర్వహించనున్నట్టు తేలడంతో ఇక నుంచి రెండు పార్టీల మధ్య నువ్వా నేనా అనే రీతిలో పోటీ ఉంటుందని భావిస్తున్నారు.