ఆ దేశంలో ఇక బంగారు నాణేలు, దాచుకోడానికి కాదు, రోజూ వాడుకోడానికే - MicTv.in - Telugu News
mictv telugu

ఆ దేశంలో ఇక బంగారు నాణేలు, దాచుకోడానికి కాదు, రోజూ వాడుకోడానికే

July 6, 2022

భయంకరమైన ద్రవ్యోల్బణంతో అతలాకుతలమైన జింబాబ్వే దేశం దానిని అధిగమించడానికి కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వడ్డీ రేట్లను రెట్టింపు పెంచిన ఆ దేశ కేంద్ర బ్యాంకు నగదు సమస్యను తీర్చేందుకు బంగారు నాణేలను ముద్రించాలని నిర్ణయించింది. జులై 25వ తేదీ నుంచి 22 క్యారెట్ల బంగారు నాణేలను అందుబాటులోకి తీసుకొస్తామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ జింబాబ్వే గవర్నర్ జాన్ పి ముంగుడి వెల్లడించారు. ఒక్కో నాణెం బరువు సుమారు 31.10 గ్రాముల బరువుంటుంది. ‘మోసి ఓ తున్యా గోల్డ్ కాయిన్‌గా పిలిచే ఈ బంగారు నాణేలను దేశీ కరెన్సీ, అమెరికా డాలర్లు, ఇతర విదేశీ కరెన్సీలను ఉపయోగించి కొనుగోలు చేయవచ్చు. ప్రతీ నాణేనికి సీరియల్ నెంబర్ ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధర, తయారీ ఖర్చు కలిపి ఉంటుంది. దీనిని తేలికగా నగదు రూపంలో మార్చుకోవచ్చు’ని ఆయన వివరించారు. ఇదికాక, వచ్చే ఐదేళ్లలో అమెరికా డాలరును కరెన్సీగా వాడాలనే ప్రతిపాదనను ఆ దేశం పరిశీలిస్తోంది.