అగ్రరాజ్యం అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా ప్రబలుతున్న మంకీపాక్స్ వ్యాధి కట్టడికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యాధిపై పర్యవేక్షణ, నియంత్రించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఈ వ్యాధి గురించి కేంద్రానికి ఈ టాస్క్ ఫోర్స్ దిశానిర్దేశం చేయనుంది. వ్యాధి నిర్ధారణ కేంద్రాలు విస్తరించడం, వ్యాక్సినేషన్ వంటి వాటిపై సూచనలు ఇవ్వనుంది. శనివారం కేరళలో మంకీపాక్స్ సోకిన యువకుడు మరణించిన నేపథ్యంలో కేంద్రం ఈ చర్యకు పూనుకుంది. జులై 26న జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీనికి నీతి అయోగ్ సభ్యుడు డా. వీకే పాల్ నాయకత్వం వహించనున్నారు. దీంతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న 15 ఐసీఎంఆర్ ల్యాబుల్లో మంకీపాక్స్ పరీక్షలు నిర్వహించేలా సదుపాయాలు పెంచేలా ఆదేశాలు జారీ చేశారు. కాగా, దేశంలో ఇప్పటివరకు నాలుగు మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి.