మతమార్పిడి విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బలవంతపు మత మార్పిడిని అరికట్టడానికి త్వరలో చట్టం తెస్తున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ అంశాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని, చట్టం ద్వారా అరికట్టాలని నిర్ణయించినట్టు పేర్కొంది.
ఇప్పటికే దేశంలోని 9 రాష్ట్రాలు ఈ రకమైన చట్టాలు తెచ్చాయని, కేంద్రం తరపున కూడా అతి త్వరలో చట్టం తెస్తామని తెలియజేసింది. కాగా, ఇప్పటివరకు బలవంతపు మతమార్పిడి నిరోధక చట్టాన్ని తెచ్చిన వాటిలో బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు కాంగ్రెస్ పాలిత, ప్రాంతీయ పార్టీల పాలిత రాష్ట్రాలు కూడా ఉన్నాయి. మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక, హర్యానాలలో బీజేపీ అధికారంలో ఉండగా, చత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్, ఒడిషా, జార్ఖండ్ లలో ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి. ఈ చట్టాలు వివిధ రాష్ట్రాలలో కొంత వేర్వేరుగా ఉన్నా అన్నింటిలో కొన్ని కామన్ వివరణలు ఉన్నాయి. తప్పుడు వివరణ, బలవంతం, మోసం, అనుచిత ప్రలోభాల వంటివి ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో లవ్ జిహాద్ కూడా ఉంది. ఆయా రాష్ట్రాల ప్రకారం నేరం రుజువైతే జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధిస్తారు.