ఈ మధ్యకాలంలో పెట్రోల్ ధరలతో పాటు వంటనూనెల ధరలు కూడా భారీగా పెరగడంతో సామాన్యులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. కేంద్రం కొన్ని చర్యలు తీసుకున్నా అవి ఏమాత్రం ధరలను కట్టడి చేయలేదు. ఈ నేపథ్యంలో కేంద్రం కఠిన చర్యలు తీసుకుంది. వంట నూనెల రిటైల్ ధరలను లీటరుకు రూ. 15 మేర తగ్గిస్తున్నట్టు వెల్లడించింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపింది. వ్యాపారస్తులు ఈ ప్రయోజనాన్ని వినియోగదారులకు తక్షణం అందించాలని ఆదేశించింది.
ఈ మేరకు సంబంధిత శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతర్జాతీయ ధరలు దిగిరావడం, ఆయిల్ తయారీ కంపెనీలతో కేంద్రం జరిపిన చర్చలతో ధరలు ఈ మేరకు తగ్గాయి. దీంతో వంటింటి బడ్జెట్ నుంచి కాస్త ఉపశమనం కలిగించినట్టయింది. కాగా, మన దేశ వంట నూనె అవసరాల కోసం ఎక్కువగా దిగుమతుల మీదే ఆధారపడతాం. ఉక్రెయిన్ నుంచి పొద్దుతిరుగుడు నూనె, ఇండోనేషియా నుంచి పామాయిల్లను భారీగా దిగుమతి చేసుకునే దేశాల్లో మన దేశం ఒకటి. ఈ పరిస్థితిని గమనించే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో పామాయిల్ పంటను పండించడానికి రైతులకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ప్రకటించాయి. దాంతో ఈ పంట సాగు తెలంగాణలో గణనీయంగా పెరిగింది. దీని ఫలితాలు రావాలంటే కొంత కాలం ఆగాల్సిన పరిస్థితి ఉంది.