The Central Govt has amended the Electricity Act
mictv telugu

ఇక నుంచి నెలనెలా కరెంట్ బాదుడు.. కేంద్రం ఆదేశాలు

August 13, 2022

వాడుకున్న కరెంటుకి నెలనెలా కడుతున్న యూనిట్ వారీ ఛార్జీలు ఇక నుంచి ప్రతీ నెలా మారనున్నాయి. మార్కెట్‌లో ఉన్న ధరల హెచ్చుతగ్గులకు అనుగుణంగా డిస్కంలు ప్రజల నుంచి డబ్బు వసూలు చేసేందుకు కేంద్రం విద్యుత్ చట్టానికి సవరణలను ప్రతిపాదించింది. రోజురోజుకీ బొగ్గు, ఇతర ఖర్చులు పెరిగిపోతుండడంతో కొత్త విధానంలో ఛార్జీలు పెరిగే అవకాశముంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల విద్యుత్ శాఖలు, సంస్థలకు కేంద్రం ముసాయిదాను పంపింది. ఏమైనా అభ్యంతరాలుంటే సెప్టెంబర్ 11 లోగా తెలియజేయాలని సూచించింది. స్థూలంగా చెప్పాలంటే పెట్రోల్, డీజిల్ ధరలను అంతర్జాతీయ ధరలకనుగుణంగా ఎలాగైతే పెంచడం, తగ్గించడం వంటి అధికారాన్ని ఆయా పెట్రోలియం కంపెనీలకు ఉందో ఇక నుంచి విద్యుత్ రంగంలో కూడా అలాగే జరుగుతుంది. అంటే ఒక్కోసారి విద్యుత్ సంస్థలు ఒక యూనిట్‌ను రూ. 12 పెట్టి కూడా కొనుగోలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా వేసవిలో జల విద్యుత్ అందుబాటులో లేనప్పుడు ఈ పరిస్థితి తలెత్తుతుంది. అయినా కూడా ప్రజలకు తక్కువ ధరకే విద్యుత్ సరఫరా అవుతోంది. ఇక నుంచి ఆ పరిస్థితిలో మార్పు వస్తుంది. కొన్న ధరనే వినియోగదారుడి నుంచి వసూలు చేస్తారు.