the children who born on Aug 15th will be provided free ride in TSRTC city buses for 12 years
mictv telugu

ఆగష్టు 15న పుడితే.. 12 ఏండ్లు వచ్చేదాక ఉచిత ప్రయాణం!

August 9, 2022

‘అజాదీ కా అమృతోత్సవ్‌’ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ 12 రోజుల పాటు వినూత్న కార్యక్రమాలను చేపట్టింది. ఇందులో భాగంగా ఆగస్టు 15వ తేదీన పుట్టబోయే వారికి 12 ఏండ్ల పాటు రాష్ట్రంలోని అన్ని సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తామని టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, వైస్‌చైర్మన్‌, ఎండీ సజ్జనార్‌ తెలిపారు. 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వృద్ధులు ఈ నెల 15న ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు.

ఆగస్టు 9 నుంచి 21 వరకు ‘వీల్స్‌ ఆన్‌ ఫ్రీడం-టేకింగ్‌ తెలంగాణ ఫార్వ ర్డ్‌’ పేరుతో స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్టు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా ఆగష్టు 15న రూ.120 ఉన్న టీ-24 టికెట్లను రూ.75కే ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఆగస్టు 16 నుంచి 21 వరకు టీటీడీ ప్యాకేజీలపై రూ.75 రాయితీ ఇస్తామని తెలిపారు. 1 కిలో లోపు బరువు ఉన్న కార్గో పార్సిళ్లపై ఆగస్టు 15న 75 కిలోమీటర్ల వరకు ఎలాంటి చార్జీలు వసూలు చేయబోమన్నారు. ఆగస్టు 15 నుంచి 22 వరకు 75 ఏండ్లు దాటిన వృద్ధులకు తార్నాక ఆర్టీసీ దవాఖానలో ఉచిత మెడికల్‌ చెకప్‌తో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేస్తారు. 75 ఏండ్లలోపు వారికి రూ.750 మెడికల్‌ చెకప్‌ ప్యాకేజీతో పాటు మందులపై 75% రాయితీ ఇస్తారు.

టాప్‌-75 ప్రయాణికులకు ఒక ట్రిప్‌ టికెటు ఉచితంగా ఇవ్వనున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయానికి ఆగస్టు 15న పుష్పక్‌ ఎయిర్‌ పోర్ట్‌ సర్వీసును వినియోగించుకునే ప్రయాణికులు 75 శాతం ఛార్జీ చెల్లిస్తే చాలని చెప్పారు. ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు అన్ని బస్సులకు జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేస్తామని, ఉద్యోగులంతా అమృతోత్సవ్‌ బ్యాడ్జీలతోనే విధులకు హాజరు కావాలని ఎండీ వీసీ సజ్జనార్ కోరారు.