The Chinese government unleashed war tanks on the people
mictv telugu

వీడియో : చైనాలో బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్ సంక్షోభం.. జనాలపై యుద్దట్యాంకుల మొహరింపు

July 21, 2022

నియంత, కమ్యూనిస్టు దేశమైన చైనాలో మరో దారుణం జరుగబోతుందా? 33 ఏళ్ల క్రితం త్వియాన్మెన్ స్క్వేర్‌లో జరిగిన మారణహోమం మళ్లీ రిపీటవుతుందా? అనే సందేహాలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. అప్పుడు ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాటం జరిగితే, ఇప్పుడు తాము సంపాదించిన డబ్బుల కోసం తిరగబడిన జనాలను చంపడానికి చైనా ప్రభుత్వం దుస్సాహసానికి పాల్పడుతోంది. కరోనా అనంతర పరిస్థితులు, రష్యా – ఉక్రెయిన్ యుద్ధం, నిరుద్యోగిత, రియల్ ఎస్టేట్ సంక్షోభం, బ్యాంకింగ్ సెక్టార్‌లో పేరుకుపోయిన మొండి బాకీలతో ఆ దేశం తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. ఇటీవలే చైనాలోని రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇళ్ల కొనుగోలు దారుల నుంచి ఈఎంఐలుగా పుచ్చకాయలు, వెల్లుల్లి పాయలు ఇవ్వాల్సిందిగా కోరింది. అంటే అక్కడి పరిస్థితులు ఎంత దిగజారిపోయాయో అర్ధం చేసుకోవచ్చు.

ఈ నేపథ్యంలో విశ్వాసం కోల్పోయిన ప్రజలు తాము బ్యాంకుల్లో దాచుకున్న డబ్బులను విత్ డ్రా చేసుకునేందుకు వెళితే ప్రభుత్వం మాత్రం వారిని భయపెట్టడానికి యుద్ధ ట్యాంకులను మొహరిస్తోంది. అవి మీ సొమ్మే అయినా, డిపాజిట్లు కావని, పెట్టుబడి సొమ్ముగా పేర్కొంటూ వారిని దబాయిస్తోంది. హెనన్ ప్రావిన్స్‌లో గ్రామీణ, పట్టణ బ్యాంకులు నగదు విత్ డ్రా చేసుకోకుండా ప్రజలను అడ్డుకుంటున్నాయి. దీంతో గత కొన్ని వారాలుగా ఖాతాదారులు, పోలీసుల మధ్య గొడవలు జరిగాయి. ఈ క్రమంలో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుని బ్యాంకుల మీద దాడి చేస్తారనే ఉద్దేశంతో నిరసనకారులను భయపెట్టడానికి యుద్ధ ట్యాంకులను బ్యాంకుల వద్ద మొహరిస్తోంది. ఇదిలా ఉండగా, వచ్చే అక్టోబరులో చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ మూడో సారి అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనబోతున్నారు. అప్పటివరకు ప్రజలను కంట్రోల్‌లో పెట్టడానికి ఎంతకైనా తెగించే అవకాశముందని అంతర్జాతీయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రస్తుత ప్రపంచ పరిణామాల నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు అంతర్జాతీయ హెచ్చరిక చేసింది. ధరల పెరుగుదలతో ఈ ఏడాది కష్టంగా ఉంటుందని, కానీ, 2023 మాత్రం 2008 ఆర్ధిక మాంద్యం నాటి గడ్డు పరిస్థితులు రావచ్చని బలంగా చెప్తున్నాయి. ఇందుకు శ్రీలంకతో పాటు అప్పులు ఎక్కువై, అభివృద్ధి కుంటుపడిన దేశాల జాబితాను ప్రస్తావిస్తోంది. మరీ దారుణం కాకపోయినా చైనాలో గతంలో ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి జీడీపీ రేటు పడిపోవడం ప్రస్తావనార్హం. దీంతో ప్రపంచ దేశాలు ఇప్పటికే తమతమ జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.