కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ మేకింగ్ వీడియో రిలీజ్ - MicTv.in - Telugu News
mictv telugu

కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ మేకింగ్ వీడియో రిలీజ్

August 16, 2022

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘బింబిసార’. ఈ సినిమాతో మరోసారి ఫామ్‌లోకి వచ్చాడు కళ్యాణ్ రామ్. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్.. బింబిసారుడుగా, దేవదత్తుడుగా రెండు విభిన్న పాత్రల్లో అలరించాడు. ఫస్ట్ డే నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా ఫస్ట్ వీకెండ్‌లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. దాదాపు రెండేళ్లు లాంగ్ గ్యాప్ తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన వసూళ్లను రాబట్టింది.

ఈ సందర్భంగా సినిమా యూనిట్ ‘ది క్రానికల్స్‌’ పేరిట మేకింగ్‌ వీడియోను విడుదల చేసింది. సోషియో ఫాంటసీ కథలను తెరకెక్కించటం ఎంత కష్టమో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. సినిమా సెట్స్‌లో వాతావరణం ఎలా ఉంటుంది?ఈ చిత్రంలోని పోరాట దృశ్యాల్ని ఎలా షూట్‌ చేశారు? కథానాయకుడు పరిగెత్తే సీన్‌ని ఎలా క్యాప్చర్‌ చేశారు? తదితర విశేషాల్ని ఈ వీడియోలో చూడొచ్చు.

యంగ్‌ డైరెక్టర్‌ వశిష్టకు ఇది తొలి సినిమా అయినప్పటికీ.. అద్భుతంగా తెరకెక్కించాడు. కీరవాణి నేపథ్య సంగీతం, చోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ ఈ సినిమా స్థాయిని పెంచాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై వచ్చిన ఈ చిత్రంలో కేథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. కల్యాణ్‌రామ్‌ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌ చిత్రంగా తెరకెక్కిన ఈ ‘బింబిసార’కు సీక్వెల్‌ వచ్చే అవకాశం ఉంది.