ఎన్నిసార్లు చెప్పినా వినలేదని.. వాననీటిలో పడుకుని - MicTv.in - Telugu News
mictv telugu

ఎన్నిసార్లు చెప్పినా వినలేదని.. వాననీటిలో పడుకుని

September 25, 2019

వర్షం పట్టిందంటే వదలా బొమ్మాళీ అన్నంత పనే చేస్తోంది. పల్లెల్లో అయితే సమస్య లేదు గానీ పట్నంలోనే అసలు సమస్య మొదలవుతుంది. నగరంలో మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వాన కురిసింది. ఈ వర్షానికి హైదరాబాద్ నగరం జలమయం అయిపోయింది. పలు ప్రాంతాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలోకి కూడా వరదనీరు వచ్చి చేరుతోంది. హయత్‌నగర్‌ డివిజన్‌ పరిధిలోని సుష్మా సాయినగర్‌ గ్రీన్‌ మిడోస్‌ కాలనీలోకి వెళ్లే దారిలో భారీగా వర్షపు నీరు నిలిచింది. 

rainwater

దీంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలోంచి బయటకు రావాలంటే జనాలు బెండేలెత్తిపోతున్నారు. అధికారులు కూడా అదే అనుకుని తమ ఇళ్లల్లో వెచ్చగా ముడుచుకుని కూర్చున్నట్టున్నారు. అయితే కాలనీవాసులు అందరూ కలిసి తమ సమస్య గురించి స్థానిక కార్పొరేటర్‌ సామ తిరుమల్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే కార్పొరేటర్‌ అక్కడికి చేరుకుని అధికారులపై మండిపడ్డారు. అధికారులను మేల్కొలపడానికి ఆయన వర్షపు నీటిలో పడుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. సమస్యలపై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని అన్నారు.