The counting of votes for the Munugode by-election, has started
mictv telugu

మునుగోడు బైపోల్ కౌంటింగ్ ప్రారంభం.. పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు

November 6, 2022

రాష్ట్రవ్యాప్తంగా ఎదురుచూస్తున్న మునుగోడు ఉప ఎన్నికల కౌంటింగ్‌ కాసేపటి క్రితం ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు చేపట్టారు. 8.30 నుంచి ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు. ఉదయం 9 తర్వాత తొలి రౌండ్‌ ఫలితం వెలువడే అవకాశం ఉంది. ఈ ఉప పోరులో మొతత్తం 47 మంది నిలబడగా.. ప్రధాన పోటీ మాత్రం బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య ఉంది. మొత్తం 2,41,805 మంది ఓటర్లకుగాను 2,25,192 మంది ఓటు వేశారు. పోలింగ్(పోస్టల్బ్యాలెట్ ఓట్లు కలుపుకొని) 93.41 శాతం నమోదైంది. నల్గొండలోని ఆర్జాలబావి ఎఫ్ సీఐ గోదాంలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇక కౌంటింగ్ విధుల్లో మొత్తం 250 మంది సిబ్బంది పాల్గొన్నారు. లెక్కింపు కోసం 100 మంది.. ఇతర విధులకు 150 మందిని కేటాయించారు ఉన్నతాధికారులు. ముందుగా చౌటుప్పల్‌, నారాయణపురం, మునుగోడు మండలాల ఓట్ల లెక్కింపు చేపడతారు.

మునుగోడు ఉప ఎన్నికలు ఫలితాలు ఆదివారం వెలువడనున్న నేపథ్యంలో నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు నల్గొండకు మకాం మార్చారు. అనుచరులు మాత్రం గ్రామాల్లోనే ఫలితాల కోసం వేచి చూస్తున్నారు. గతంలో ఏ ఎన్నిక జరిగినా ఫలితాలు రాక ముందే తమదంటే తమదే విజయమని సమాచార సాధనాల్లో ప్రకటనలు చేసే రాజకీయ పార్టీల నాయకులు ప్రస్తుతం అందుకు భిన్నంగా మౌనం వహిస్తుండటం గమనార్హం. ఉప ఎన్నికలో ఓటర్లు ఎవరిని ఆదరించారోననేది తేల్చుకోలేకపోతున్నారు.