The court dismissed the petition filed by Rajesh to extend the parole period
mictv telugu

భార్యను 72 ముక్కలు చేసిన టెకీ.. డెహ్రాడూన్‌లో సేమ్ సీన్

November 16, 2022

The court dismissed the petition filed by Rajesh to extend the parole period

సహజీవనం చేసి పెళ్లి చేసుకుందామన్న ప్రేయసి శ్రద్ధా వాకర్‌ను దారుణంగా హత్య చేసి 35 ముక్కలుగా కోసిన అఫ్తాబ్ అమీన్ పూనావాలా ఢిల్లీ ఘటన మరువకముందే మరో కిరాతకం వెలుగు చూసింది. భార్యను 72 ముక్కలుగా కోసి ఫ్రిడ్జిలో శరీరభాగాలను దాచిపెట్టిన ఓ టెకీ భర్త వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది. 2010లో జరిగిన ఈ దారుణంలో నేరస్థుడు జీవిత ఖైదు అనుభవిస్తుండగా, ప్రస్తుతం పెరోల్‌పై బయట ఉన్నాడు. అయితే పెరోల్ గడువు పెంచాలని తాజాగా కోర్టును కోరడంతో మరోసారి ఈ అంశం చర్చనీయాంశమైంది.

అసలేం జరిగిందంటే.. డెహ్రాడూన్‌‌కి చెందిన రాజేశ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ జాబ్ చేసేవాడు. 1999లో ఢిల్లీకి చెందిన అనుపమతో పరిచయం అయింది. కొంతకాలం ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. తర్వాత అమెరికా వెళ్లిన దంపతులు ఐదేళ్లు అక్కడే సంతోషంగా గడిపారు. తిరిగి డెహ్రాడూన్ చేరుకున్నా అన్యోన్యంగానే ఉండేవారు. అయితే భార్య అనుపమకు రోజూ తన తల్లితో ఫోన్‌‌లో మాట్లాడడం అలవాటు. 2010లో చివరిసారి తల్లితో మాట్లాడింది. తరవాత అనుపమ నుంచి ఎలాంటి ఫోన్ రాకపోవడంతో అనుమానించిన అనుపమ అన్న డిసెంబర్ 17న పోలీస్ కేస్ పెట్టాడు. అనుపమ కుటుంబ సభ్యులు పోలీసులను వెంటేసుకొని వెళ్లి రాజేశ్‌ను, అతని తల్లిదండ్రులను నిలదీయగా, మొదట బుకాయించిన రాజేశ్ ఇంట్లోకి ఎవరినీ రానీయలేదు.

చివరకి పోలీసులు గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో వెనక్కి తగ్గాడు. అనంతరం పోలీసులు జరిపిన విచారణలో దిమ్మతిరిగే విషయాలు బయటపడ్డాయి. టెక్కీ రాజేశ్ అనుపమను హత్య చేసి స్టోన్ కట్టర్‌‌తో ఆమె శవాన్ని 72 భాగాలు చేశాడు. ఆ ముక్కలను ఫ్రిడ్జీలో దాచిపెట్టాడు. ఈ సాక్ష్యాలన్నీ సేకరించిన పోలీసులు వాటిని కోర్టులో ప్రవేశపెట్టడంతో కొన్ని సంవత్సరాల విచారణ తర్వాత రాజేశ్‌కు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. అప్పటినుంచి జైలులోనే ఉన్న రాజేశ్.. ఇటీవల అనారోగ్య కారణాలతో పెరోల్‌‌పై బయటికి వచ్చాడు. పెరోల్ గడువు ముగియడంతో గడువు పెంచాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. కానీ, కోర్టు అందుకు నిరాకరించింది. ఢిల్లీ ఉదంతం సంచలనం రేపిన సమయంలోనే రాజేశ్ పెరోల్ గడువు పెంచాలని పిటిషన్ దాఖలు చేయడంతో ఈ క్రైం ఘటన మరోసారి హాట్ టాపిక్ అయింది.